IPL 2025 Play Offs News: ప్ర‌పంచ‌లోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ తుది ద‌శ‌కు చేరుకుంది. 70 లీగ్ మ్యాచ్ లు ముగిశాక‌, కీల‌క‌మైన ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల‌కు రంగం సిద్ధ‌మైంది. గురువారం నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు జ‌రుగుతాయి. ఇందులో భాగంగా క్వాలిఫ‌య‌ర్ 1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు పంజాజ్ ఉమ్మ‌డి రాజ‌ధాని న‌గ‌రం చంఢీగ‌డ్ స‌మీపంలోని ముల్ల‌న్ పూర్ లో జ‌రుగుతాయి. గురువారం క్వాలిఫ‌య‌ర్ 1, శుక్ర‌వారం ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు జ‌రుగుతాయి. అయితే స‌రిహ‌ద్దు రాష్ట్ర‌మైన పంజాబ్ లో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా, ఈ మ్యాచ్ ల నిర్వ‌హ‌ణ‌కు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు పంజాబ్ ప్ర‌భుత్వ పోలీసు యంత్రాంగం ప్ర‌క‌టించింది. మ్యాచ్ ల నిర్వ‌హ‌ణ కోసం ప‌గ‌డ్బందీ ఏర్పాట్ల చేసిన‌ట్లు వెల్ల‌డించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ ల నిర్వ‌హ‌ణ‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున‌ట్లు తెలిపింది. 

 

మాక్ డ్రిల్..భార‌త్, పాకిస్థాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న క్ర‌మం లో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టంగా చేసిన‌ట్లు పోలీసు యంత్రాంగం తెలిపింది. ఈ రెండు మ్యాచ్ ల‌ను చూసేందుకు దేశ‌వ్యాప్తంగా చాలామంది అభిమానులు స్టేడియాల‌కు వ‌స్తార‌ని, వాళ్ల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా ఏర్పాట్లు చేసిన‌ట్లు స్పెష‌ల్ డీజీపీ అర్ఫిత్ శుక్లా తెలిపారు. ఇప్ప‌టికే భ‌ద్ర‌త‌కు సంబంధించి ప‌లు స‌మావేశాలు నిర్వ‌హించి, మాక్ డ్రిల్ ను కూడా కంప్లీట్ చేసిన‌ట్లు తెలిపారు. భ‌ద్ర‌త కోసం 56 మంది గెజిటెడ్ ఆఫీస‌ర్ల‌తోపాటు 2500 మందితో ర‌క్ష‌ణ ఏర్పాటు చేసినట్లు వెల్ల‌డించారు.  మ‌రోవైపు ఈసారి ఫైన‌ల్లో ఒక నాన్ చాంపియ‌న్ ఉండ‌బోతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ఫైన‌ల్ కు సై..ఇక క్వాలిఫ‌య‌ర్ 1కు అర్హ‌త సాధించిన ఆతిథ్య పంజాబ్ కింగ్స్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు.. గురువారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు అర్హ‌త సాధించ‌నుంది. దీంతో ఈ సారి ఫైన‌ల్లో ఒక నాన్ చాంపియ‌న్ జ‌ట్టును చూడ‌నున్నామ‌ని విశ్ల‌ష‌కులు పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్ లో ఓడిన జ‌ట్టు క్వాలిఫ‌య‌ర్ 2ను అహ్మ‌దాబాద్ వేదిక‌గా జూన్ 1న ఆడుతుంది. అంత‌కుముందు ఎలిమినేట‌ర్ లో ముంబై ఇండియ‌న్స్, గుజరాత్ టైటాన్స్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇందులో గెలిచిన జ‌ట్టు క్వాలిఫ‌య‌ర్ 2 లో ఆడ‌నుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్ కు చేరుకుంటుంది. ఫైన‌ల్ కూడా అహ్మ‌దాబాద్ వేదిక‌గా జూన్ 3న జ‌రుగుతుంది.