PBKS vs GT IPL 2024 Preview and Prediction : వరుస పరాజయాలతో సతమతమవుతున్న రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ప్రతీ మ్యాచ్... ప్రతీ పాయింట్ కీలకంగా మారిన వేళ..పంజాబ్ కింగ్స్‌తో-గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
గుజరాత్‌పై గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని పంజాబ్(PBKS) చూస్తుండగా.. గుజరాత్(GT) కూడా అదే చేయాలని చూస్తోంది. ఐపీఎల్ ఛాంపియన్ అయిన గుజరాత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
బ్యాటర్లు గాడిన పడతారా..
పాయింట్ల పట్టికలో గుజరాత్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఏడు మ్యాచుల్లో మూడు విజయాలు.. నాలుగు పరాజయాలతో కొనసాగుతోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీనిని ఢిల్లీ బ్యాటర్లు సునాయసంగా ఛేదించారు. మరోవైపు పంజాబ్ ఏడు మ్యాచుల్లో రెండు విజయాలు అయిదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో ఓడిపోవడంతో పంజాబ్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ముంబైతో మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయినా అశుతోష్ శర్మ అద్భుత పోరాటం ఆకట్టుకుంది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 14 పరుగులకే నాలు వికెట్లు కోల్పోయినా అశుతోశ్... చివరి వరకూ పోరాడాడు.
ఇవీ పంజాబ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశం ఉంది. కెప్టెన్ శిఖర్ ధావన్ లేకపోవడం పంజాబ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఇవాళ జరిగే మ్యాచ్‌కు కూడా ధావన్ అందుబాటులో ఉండడం సందేహంగానే ఉంది. ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భుజం గాయం కారణంగా ధావన్ మ్యాచ్‌కు దూరమవ్వగా... శామ్ కరణ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, రిలీ రోసౌ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. ఇది పంజాబ్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. శశాంక్, అశుతోష్‌ల విధ్వంసంతోనే పంజాబ్ ఈ మాత్రమైనా రాణిస్తోంది.
గుజరాత్‌ది అదే కథ
ఏడు మ్యాచుల్లో మూడు విజయాలు.. నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో గుజరాత్ ఎనిమిదో స్థానంలో ఉంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్ రషీద్ ఖాన్ వంటి నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నా గుజరాత్ రాణించలేకపోతోంది. రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, నూర్ అహ్మద్ వంటి దిగ్గజ ఆటగాళ్లు రాణిస్తే గుజరాత్‌కు విజయం దక్కడం కష్టమేమీ కాదు. ఒక్క మ్యాచ్‌లో గెలిచి గెలుపు బాట పడితే గుజరాత్‌ను ఆపడం కష్టమే. కానీ మహ్మద్ షమీ లేకపోవడం గుజరాత్‌ను తీవ్రంగా నష్టపరిచింది. ఉమేష్ యాదవ్ కూడా ఏడు వికెట్లు తీసుకున్నా భారీగా పరుగులు సమర్పిస్తున్నాడు. స్టార్ స్పిన్నర్ రషీద్ తన శక్తి మేరకు రాణిస్తున్నాడు.
జట్లు:
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, మాథ్యూ వేడ్, కేన్ విలియమ్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, స్పెన్సర్ జాన్సన్, కార్తీక్ త్యాగి, జాషువా లిటిల్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మోహిత్ శర్మ, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, సందీప్ వారియర్, శరత్ బిఆర్, మానవ్ సుతార్.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్యా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.