PBKS vs GT IPL 2024 Gujarat Titans won by 3 wkts:  పంజాబ్‌ కింగ్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌  3 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్‌ ధీటైన బౌలింగ్‌తో కట్టడి చేసినప్పటికీ నిలకడగా ఆడుతూ గుజరాత్‌ బ్యాటర్లు 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకున్నారు.


143 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌ బ్యాటర్లు లక్ష్యాన్ని చేరుకునేందుకు కాస్త ప్రయాస పడ్డారు. శుభ్‌మన్‌గిల్‌  , సాయి సుదర్శన్‌  ఇద్దరూ చెరో 30 పరుగులతో  ఫర్వాలేదనిపించారు. కానీ  పంజాబ్‌ బౌలింగ్‌లో మిగిలిన బ్యాటర్లు  పెద్దగా రాణించలేదు. అయితే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆడటం సమిష్టిగా   జట్టుకు ప్లస్‌ అయ్యింది. ఇక చివరలో రాహుల్‌ తెవాటియా  విజృంభించడంతో 19.1 ఓవర్‌లోనే లక్ష్యాన్ని చేధించి.. పంజాబ్‌ను ఓడించారు.


పంజాబ్‌ ఇన్నింగ్స్‌

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కు తొలి ఓవర్‌ నుంచే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్‌ వేసిన ఒమర్జాయ్‌ కట్టుదిట్టంగా బంతులు విసరడంతో కేవలం రెండు పరుగులే వచ్చాయి. కానీ రెండో ఓవర్‌లో పంజాబ్ బ్యాటర్లు పుంజుకున్నారు. సందీప్‌ వారియర్‌ వేసిన రెండో ఓవర్‌లో పంజాబ్‌ 21 పరుగులు రాబట్టింది. ప్రభ్‌ సిమన్‌ ఆడి మూడు బౌండరీలు, ఒక సిక్స్‌ కొట్టాడు. తొలి 3 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 34 పరుగులు చేసిన పంజాబ్‌ భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ తర్వాతే పంజాబ్‌ కష్టాలు మొదలయ్యాయి.

 

52 పరుగుల వద్ద పంజాబ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 35 పరుగులు చేసి మోహిత్‌ వేసిన ఆరో ఓవర్లో అవుటయ్యాడు. పవర్‌ ప్లే పూర్తయ్యేసరికి పంజాబ్‌ స్కోర్‌ ఒక వికెట్‌ నష్టానికి 56 పరుగులు చేసింది. 63 పరుగుల వద్ద పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 7 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌ 63/2. రషీద్‌ వేసిన 8వ ఓవర్‌లో మరో వికెట్‌ పడింది. ఐదో బంతికి 20 పరుగులు చేసిన కరన్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. వికెట్లు పడటంతో పంజాబ్‌ బ్యాటింగ్‌ నెమ్మదించింది. నూర్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో పంజాబ్‌ 3 పరుగులు చేసింది. 10 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌ 74/3.  సాయి కిశోర్‌ వేసిన 14వ ఓవర్లో అశుతోష్‌(3) ఔటయ్యాడు. 5 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్‌ స్కోర్‌ 97 పరుగులకే పరిమితమైంది. 17 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌ 114/7.  సాయి కిశోర్‌ నాలుగు వికెట్లతో  పంజాబ్‌ పతానాన్ని శాసించగా నిర్ణీత 20 ఓవర్లో పంజాబ్‌ 142 పరుగులకే కుప్పకూలింది. 

 

గుజరాత్ ఆట 

143 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో ఓవర్‌లో నాలుగో బంతికి వృద్ధిమాన్‌ సాహా 13 పరుగులకే  ఔటయ్యాడు. 10వ ఓవర్‌లో మూడో బంతికి 35 పరుగులకి  శుభ్‌మన్‌ గిల్‌ పెవిలియన్ చేరాడు. రబాడా బౌలింగ్‌లో భారీ సిక్స్‌ కొట్టేందుకు యత్నించి లివింగ్‌స్టోన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 11వ ఓవర్‌లో లివింగ్‌స్టోన్‌ వేసిన ఐదో బంతికి మిల్లర్‌ బౌల్డ్‌ అయ్యాడు. 15వ ఓవర్‌లో మూడో బంతికి ఫోర్‌ బాదిన సాయి సుదర్శన్‌.. నాలుగో బంతికి బౌల్డ్‌ అయ్యాడు.   16వ ఓవర్‌లో హర్షల్‌ పటేల్‌ వేసిన రెండో బంతికి ఒమర్జాయ్‌  క్యాచ్‌ ఔటవ్వడంతో  గుజరాత్‌ పరుగుల వేగం  మందగించింది.  అప్పుడు  క్రీజులోకి వచ్చిన రాహుల్‌ తెవాటియా  విజృంభించాడు. ఇక గుజరాత్‌ విజయం ఖాయమైందని అనుకుంటున్న తరుణంలో   19వ ఓవర్‌లో గుజరాత్‌ రెండు వికెట్లను కోల్పోయింది.   అయినప్పటికీ తెవాటియా నిలకడగా ఆడి టార్గెట్‌ను చేధించాడు.