KKR vs RCB IPL 2024 Kolkata Knight Riders won by 1 run: ఐపీఎల్‌(IPL)లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు(RCB)పై కోల్‌కతా(KKR) విజయం సాధించింది. ఆఖరు వరకు జరిగిన మ్యాచ్‌లోకోల్‌క తా చివరి బంతికి గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా... నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 50 హాఫ్ సెంచరీ సాధించాడు. ఓపెనర్‌ ఫిలిప్ సాల్ట్ 48, ఆండ్రి రస్సెల్ 27, రమణ్‌ ధీప్‌ 24 పరుగులతో రాణించారు. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్ , కామెరూన్ గ్రీన్ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్‌, ఫెర్గూసన్ చెరో వికెట్‌ తీశారు. అనంతరం భారీ లక్ష్యచేధనలో బెంగళూరు చివరి వరకూ పోరాడినా ఓటమి చవిచూసింది. విల్‌ జాక్స్‌, రజత్‌ పటిదార్‌ అర్థసెంచరీలతో మెరిశారు. చివర్లో దినే‌శ్‌ కార్తీక్‌, కరణ్‌ శర్మ పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రి రస్సెల్ 3, హర్షిత్‌ రాణా, సునీల్ నరైన్‌ చెరో  రెండు వికెట్లు తీశారు.  


బ్యాటింగ్‌ సాగిందిలా..
 గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన సునీల్‌ నరైన్‌ ఈ మ్యాచ్‌లో పరుగుల కోసం ఇబ్బంది పడ్డాడు. కానీ మరోవైపు సాల్ట్  దూకుడుగా ఆడాడు. సాల్ట్‌ యశ్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదాడు. నాలుగో ఓవర్‌లో  ఫెర్గూసన్‌కు సాల్ట్  చుక్కలు చూపించాడు. ఈ ఓవర్‌లో సాల్ట్‌ నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదేశాడు. 6, 4, 4, 6, 4, 4 తో ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో  సాల్ట్‌ బీభత్సం సృష్టించాడు. సాల్ట్‌ బాదుడుతో కోల్‌కతా స్కోరు 4 ఓవర్లకు 55 పరుగులకు చేరింది. 14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 పరుగులు చేసి సాల్ట్‌ ఔటయ్యాడు. సిరాజ్‌ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి పటీదార్‌ చేతికి సాల్ట్‌ చిక్కాడు. దీంతో 56 పరుగుల వద్ద కోల్‌కతా తొలి వికెట్‌ను కోల్పోయింది. వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించే అవకాశం సాల్ట్‌కు చేజారింది. కోల్‌కతా 66 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. పది పరుగులు చేసిన సునీల్ నరైన్‌ను యశ్‌ ఔట్ చేశాడు. అతడు వేసిన బంతిని బౌండరీగా మలిచేందుకు ప్రయత్నించిన నరైన్‌ లాంగాఫ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. కోల్‌కతా స్వల్ప వ్యవధిలో మూడో వికెట్‌ను కోల్పోయింది. యశ్‌ బౌలింగ్‌లో మూడు పరుగులు చేసిన రఘువంశి ఇచ్చిన క్యాచ్‌ను ఒంటిచేత్తో కామెరూన్‌ గ్రీన్ అద్భుతంగా పట్టాడు. దీంతో 75 పరుగుల వద్ద కోల్‌కతా మూడో వికెట్‌ను నష్టపోయింది. కాసేపు కుదురుకున్న దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్ 16 పరుగులు చేసి ఔటయ్యాడు. రింకూసింగ్‌ 24 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. ఫెర్గూసన్ వేసిన స్లో బంతిని ఆడే క్రమంలో రింకు సింగ్‌ ఔటయ్యాడు. 137 పరుగుల వద్ద కోల్‌కతా ఐదో వికెట్‌ను నష్టపోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. యశ్ దయాల్ వేసిన 17వ ఓవర్‌లో 23 పరుగులు వచ్చాయి. ఇందులో సిక్స్‌, రెండు ఫోర్లు, ఐదు నోబాల్స్‌, రెండు వైడ్లు ఉన్నాయి. దీంతో కోల్‌కతా స్కోరు 177 పరుగులకు చేరింది. తర్వాత డుప్లెసిస్ పట్టిన సూపర్ క్యాచ్‌కు శ్రేయస్ ఔటయ్యాడు.దీంతో 179 పరుగుల వద్ద కోల్‌కతా ఆరో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత రమణ్‌దీప్‌ సింగ్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సిరాజ్‌ వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది .


లక్ష్యచేధనలో పోరాడినా


భారీ టార్గెట్‌తో చేధనకు దిగిన బెంగళూరు జట్టు ఆరంభంలోనే తడబాటుకు గురైంది. పవర్‌ ప్లే పూర్తయ్యే లోపే విరాట్‌ కోహ్లీ (18), డుప్లెసిస్‌ (7) పెవలియన్‌కు చేరారు. మూడో ఓవర్‌లో మొదటి బంతికే విరాట్‌ కోహ్లీ (18) ఔటయ్యాడు. హర్షిత్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చాడు. దీనిపై కోహ్లీ రివ్యూ తీసుకున్నప్పటికీ ఔట్‌గానే తేలింది. దీంతో అసహనంగా కోహ్లీ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. నాలుగో ఓవర్‌లో తొలి బంతికే డుప్లెసిస్‌ కూడా ఔటయ్యాడు.  న జాక్స్‌ (55), రజత్‌ (52) దూకుడుగా ఆడారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టుకు భారీ స్కోర్‌ అందించారు.  చివరి రెండు బంతులకు మూడు పరుగులు చేస్తే విజయం సొంతమయ్యేది. కానీ 19.5 బంతికి కరన్‌ సింగ్ ఔటవ్వగా.. చివరి బంతికి రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించి ఫెర్గూసన్‌ కూడా ఔటయ్యాడు. ఫలితంగా ఒక్క పరుగు తేడాతో బెంగళూరుపై కోల్‌కతా విజయం సాధించింది. దీంతో జాక్స్‌, రజత్‌ పాటిదార్‌ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగినప్పటికీ లాభం లేకుండా పోయింది.