IPL 2024  KKR vs RCB Match Royal Challengers Bengaluru opt to bowl:  మిణుకుమిణుకుమంటున్న ప్లే ఆఫ్‌ ఆశలైనా సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు బెంగళూరు(RCB) సిద్ధమైంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. పటిష్టమైన కోల్‌కత్తా జట్టును ఆత్మవిశ్వాసం లోపించిన బెంగళూరు జట్టు ఎదుర్కొంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బ్యాటింగ్‌లో చాలా బలంగా కనిపిస్తున్న బెంగళూరు జట్టు.. బౌలింగ్‌లో మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. మ్యాచ్‌లు గడుస్తున్నా కొద్దీ గాడిన పడుతుందనుకున్న బెంగళూరు బౌలింగ్‌... రానురాను మరింత తీసికట్టుగా మారిపోయింది. జట్టులో ఎన్ని మార్పులు చేస్తున్నా బెంగళూరు జట్టు మాత్రం.. ఇంకా విజయాల బాట మాత్రం పట్టలేదు. 


భీకర ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీ(Virat Kohli)పైనే ఆశలు పెట్టుకుని బౌలర్లపై ఆశలు వదులుకుని బెంగళూరు కోల్‌కత్తా(KKR)తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇక పోయేదేమీ లేదు కాబట్టి ప్రతీ మ్యాచ్‌ను సెమీఫైనల్‌గా భావించి ఆడుతామని ఇప్పటికే బెంగళూరు కోచ్‌  ప్రకటించాడు. మకు బౌలింగ్‌లో పెద్దగా వనరులు లేవని.. బ్యాటింగ్‌ బలంతో... ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తామని ఫాఫ్‌ డుప్లెసిస్‌ తెలిపాడు. అంటే బెంగళూరు బ్యాటర్లు భారీ స్కోర్లు చేసి... మ్యాచ్‌ను గెలవాలని చూస్తున్నారు. కోల్‌కత్తా ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలని బెంగళూరు చూస్తుండగా.. ఆర్సీబీ బౌలింగ్‌ లోపాలను ఆసరాగా చేసుకుని విరుచుకుపడాలని కోల్‌కత్తా చూస్తోంది. 


కోల్‌కత్తా బలం
సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణాలతో కోల్‌కత్తా బలంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఆరు  మ్యాచ్‌లు ఆడిన కోల్‌కత్తా నాలుగు విజయాలు.. రెండు పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌కు మరింత చేరువ కావాలని కోల్‌కత్తా భావిస్తోంది. నరైన్ కేవలం బంతితో మాత్రమే కాకుండా బ్యాట్‌తోనూ విధ్వంసం సృష్టిస్తున్నాడు. రాజస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో తన తొలి T20 సెంచరీని సాధించిన నరైన్... ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 187 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 276 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కత్తా టాప్‌ ఆర్డర్‌ మెరుగ్గా రాణిస్తుండడంతో రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్ వంటి మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లకు పరిమిత అవకాశాలు వచ్చాయి. తొలి అర్ధ సెంచరీతో యువ ఆటగాడు రఘువంశీ ఆకట్టుకున్నాడు.


హెడ్‌ టు హెడ్ రికార్డులు

ఇప్పటివరకూ ఐపీఎల్‌లో కోల్‌కత్తా- రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 32 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వాటిలో కోల్‌కత్తా 18 మ్యాచుల్లో గెలవగా.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 14 మ్యాచుల్లో విజయం సాధించింది. 

 


బెంగళూరు తుది జట్టు : ఫాఫ్‌ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, విల్ జాక్స్‌, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్, దినేశ్‌ కార్తిక్ (వికెట్ కీపర్), మహిపాల్ లామ్రోర్, కరణ్‌ శర్మ, లాకీ ఫెర్గూసన్, యశ్‌ దయాల్, సిరాజ్


కోల్‌కతా తుది జట్టు :ఫిలిప్‌ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, రఘువంశి, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేశ్‌ అయ్యర్, ఆండ్రి రస్సెల్, రింకు సింగ్, రమణ్‌దీప్  సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్ రాణా