Netizens Slam MI Captain Hardik Pandya For Ordering Around Rohit Sharma On The Field: ఐపీఎల్‌(IPL)లో గుజరాత్‌(GT)తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఫీల్డింగ్‌ స్థానాన్ని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(Hardic Pandya) మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప‌దేప‌దే రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ పొజిషన్‌ను హార్దిక్ మారుస్తూ అభిమానుల అగ్ర‌హానికి గురయ్యాడు. సాధ‌ర‌ణంగా 30 యార్డ్ స‌ర్కిల్‌లో ఉండే రోహిత్ ఈ మ్యాచ్‌లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తూ క‌న్పించాడు. గుజ‌రాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవ‌ర్‌లో రోహిత్‌ను తొలుత మిడాన్‌లో ఫీల్డింగ్‌లో చేయ‌మ‌ని చెప్పిన హార్దిక్... తర్వాత హిట్‌మ్యాన్‌ను మ‌ళ్లీ లాంగాన్‌కు వెళ్లమ‌ని సూచించాడు. హార్దిక్‌ ఆదేశాలతో రోహిత్ ప‌రిగెత్తుకుంటూ లాంగాన్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు హార్దిక్ కావాల‌నే రోహిత్ ఫీల్డింగ్‌ను పొజిషన్‌ను మార్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రోహిత్ ఫ్యాన్స్.. ఇటు గుజరాత్ టైటాన్స్ అభిమానులు గట్టిగా అరుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రవర్తించిన తీరు.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రోహిత్‌ ఇక వేరే జట్టుకు వెళ్లిపో అని కొందరు.. హార్దిక్‌కు ముందుంది మొసళ్ల పండగ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 


గుజరాత్‌ విజయం
ఐపీఎల్‌(IPL)లో ముంబై ఇండియన్స్‌(MI)కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. టైటిల్‌ వేటను ఘనంగా ఆరంభించాలనుకున్న ముంబై ఆశలపై గుజరాత్‌ టైటాన్స్‌(GT) నీళ్లు చల్లింది. తొలి మ్యాచ్‌లో ముంబైపై గుజారాయ్ అద్భుత విజయం సాధించి ఐపీఎల్‌ 17వ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. ఈమ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకోగా... బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై లక్ష్యానికి 6 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. రోహిత్‌ శర్మ, బ్రెవీస్‌ రాణించినా ముంబైకు ఓటమి తప్పలేదు. మ్యాచ్ చివర్లో గుజరాత్ బౌలర్లు అద్భుత బౌలింగ్ తో...ముంబై బాటర్లను కట్టడి చేశారు... 


లక్ష్య ఛేదన ఇలా...
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు తొలి ఓవర్‌లోనే దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ అయ్యాడు. ఒమ్రాజాయ్‌ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ వెనుదిరిగాడు. రోహిత్‌ శర్మకు జత కలిసిన నమన్‌ ధీర్ ముంబై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. 30 పరుగుల వద్ద నమన్‌ వెనుదిరిగినా రోహిత్‌ సమయోచిత ఇన్నింగ్స్‌తో తాను ఎంత విలువైన ఆటగాడినో చాటిచెప్పాడు. బ్రెవిస్‌తో జత కలిసి ముంబైను లక్ష్యం దిశగా నడిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు విలువైన 77 పరుగులు జోడించారు. 29 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్సుతో 43 పరుగులు చేసిన రోహిత్‌ను సాయి కిశోర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే 38 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సులతో 46 పరుగులు చేసిన బ్రెవిస్‌ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయిన ముంబై తొలి మ్యాచులో పరాజయం పాలైంది