KKR vs SRH IPL 2024 Qualifier 1 in Narendra Modi Stadium: ఐపీఎల్‌ 2024లో తొలి ప్లే(Play Off) ఆఫ్‌కు  రంగం సిద్దమైంది. గుజరాత్‌(Gujarat)లోని అహ్మద్‌బాద్‌లో ఉన్న నరేంద్రమోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో ఈ మ్యాచ్  జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో పిచ్‌ ఎలా స్పందిస్తుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ (Odi World Cup 2023) ఫైనల్‌ ఇదే వేదికపైనే జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ప్రపంచకప్పును ఎగరేసుకుపోయింది.


అహ్మదాబాద్‌ స్టేడియంలో ఇప్పటివరకూ రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్లే ఎక్కువ విజయం సాధించాయి. గత ఆరు మ్యాచుల్లో నాలుగుసార్లు రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలిచాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు రెండుసార్లు మాత్రమే విజయవంతంగా లక్ష్యాన్ని కాపాడుకోగలిగాయి. ఈ వేదికపై కేవలం  12సార్లు మాత్రమే 200కుపైగా పరుగులు సాధించాయి. బౌలర్లు ఈ పిచ్‌పై మెరుగ్గా రాణిస్తారు. 


ఇరు జట్లలోనూ కీలక బౌలర్లు
ఇరు జట్లలోనూ కీలక బౌలర్లు ఉన్నారు. హైదరాబాద్‌ జట్టులో భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌,  పాట్‌ క‌మిన్స్‌లతో హైదరాబాద్‌ బౌలింగ్‌ బలంగా ఉంది. ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, ముజీబ్ ఉర్ రెహమాన్‌లతో  కోల్‌కత్తా బౌలింగ్‌ చాలా బలంగా ఉంది. ఈ బౌలర్లు నరేంద్ర మోదీ స్టేడియంలో బౌలింగ్‌ అనుకూలించే పిచ్‌పై రాణిస్తే భారీ స్కోర్లు నమోదు కావడం కష్టమే.  బౌలింగ్ విష‌యానికొస్తే భువ‌నేశ్వర్ కుమార్ 24 వికెట్లు, ర‌స్సెల్ 17 వికెట్లు తీశారు. వీళ్లు మరోసారి రాణిస్తే... ఇరు జట్లలోని బ్యాటర్లకు తిప్పలు తప్పవు. బౌలింగ్ విష‌యంలో 24.75 కోట్లతో కొనుక్కొన్నమిచెల్ స్టార్క్  కోల్‌కత్తాకు ప్రధాన ఆయుధంగా ఉన్నాడు.మరోవైపు కమిన్స్‌, అయ్యర్‌లు కెప్టెన్‌లుగా జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నారు.


బ్యాటింగ్‌లోనూ..
మోదీ స్టేడియంలోని పిచ్‌పై బ్యాటర్లు ఓపిగ్గా ఎదురుచూడాల్సి ఉంది. పిచ్‌ నెమ్మదిగా స్పందిస్తే బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి. కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌లో మ‌నీష్‌పాండే, శ్రేయ‌స్ అయ్యర్‌, ఫిలిప్‌సాల్ట్‌, నితీష్‌రాణా, రూథ‌ర్‌ఫోర్డ్‌, వెంక‌టేశ్‌ అయ్యర్‌, రింకూసింగ్, ర‌స్సెల్ కూడా భీకరంగానే ఉన్నారు. స‌న్‌రైజ‌ర్స్ కి కోల‌క‌తా పై 228 అత్యధిక ప‌రుగులు ఉంటే కోల్‌క‌తా హైదరాబాద్‌పై త‌క్కువ స్కోరు 101 గా న‌మోదు చేసింది. ఇక 2017లో డేవిడ్ వార్నర్‌, 2023లో హారీబ్రూక్ కోల్‌క‌తాపై సెంచ‌రీలు బాదిన క్రికెట‌ర్లుగా ఉన్నారు.