IPL 2025 MI Gets 1st Victory In This Season: ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్.. ఈ సీజన్ లో తొలి విజయం సాధించింది. ముంబైలో సోమవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ పై 8 వికెట్లతో విజయం సాధించింది. ఫస్ట్ బౌలింగ్ లో కేకేఆర్ ను అల్లాడించిన ముంబై, ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ దూకుడుగా ఆడి తొలి గెలుపును రుచి చూసింది. ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటయింది. అంగ్ క్రిష్ రఘువంశీ (26) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అరంగేట్ర పేసర్ అశ్వనీ కుమార్ నాలుగు వికెట్లతో కేకేఆర్ ను వణికించాడు. ఇక ఛేదనను ముంబై కేవలం 12.5 ఓవర్లలో 2 వికెట్లకు 121 పరుగలు చేసి, కంప్లీట్ చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) స్టన్నింగ్ ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ముంబై ఖాతా తెరిచింది.
కుప్పకూలిన కేకేఆర్.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కు ఏదీ కలిసి రాలేదు. ఈ మ్యాచ్ లో తిరిగి జట్టులోకి వచ్చిన విధ్వంసక ఆల్ రౌండర్ సునీల్ నరైన్ డకౌట్ తో నిరాశ పరిచాడు. అక్కడి నుంచి వరుస విరామాల్లో వికెట్లను కేకేఆర్ కోల్పోయింది. మిడిలార్డర్లో రఘువంశీ మాత్రమే కాస్త టెంపర్మెంట్ చూపించాడు. అతను ఔటయ్యాక మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఓ ఎండ్ లో వికెట్లు పడుతున్నా, చెత్త షాట్లు ఆడుతూ ఏమాత్రం మెచ్యూరిటీని కేకేఆర్ బ్యాటర్లు చూపించలేకపోయారు. చివర్లో రమణ్ దీప్ సింగ్ (22) బ్యాట్ ఝళిపించడంతో వంద పరుగుల మార్కును దాటింది. మిగతా బౌలర్లలో దీపక్ చాహర్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
రోహిత్ మళ్లీ విఫలం.. ఇక స్వల్ప టార్గెట్ ను ఛేదించడంలో ముంబైకి మంచి ఆరంభమే దక్కింది. అయితే బంతికో పరుగు చేసిన రోహిత్ శర్మ (13) విఫలమయ్యాడు. మరో ఎండ్ లో రికెల్టన్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో తొలి వికెట్ కు 46 పరుగులు జోడించాక రోహిత్ ఔటయ్యాడు. ఆ తర్వాత వన్ డౌన్ బ్యాటర్ విల్ జాక్స్ (16) తో కలిసి రికెల్టన్ వేగంగా ఆడాడు. మ్యాచ్ ను వీలైనంత త్వరగా ముగించాలని రికెల్టన్ భావించాడు. ఈ క్రమంలో 33 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. విజయానికి 26 పరుగులు అవసరమైన దశలో జాక్స్ ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్ కు నమోదైన 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ (27 నాటౌట్)తో కలిసి రికెల్టన్ జట్టును విజయ తీరాలకు చేరాడు. అండ్రీ రస్సెల్ కు రెండు వికెట్లు దక్కాయి.