Mukul Choudhary: ఈడెన్ గార్డెన్‌‌లో రెండు రోజుల క్రితం జరిగిన మ్యాచ్ నేటికీ చాలా మంది మైండ్‌లో ఉండిపోయింది. ఓడిపోతున్న లక్నో సూపర్ జెయింట్స్‌ను గెలిపించిన ముకుల్‌ చౌదరి ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ద కంట్రీ అయ్యాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో అలవోకగా ఏడు సిక్సర్లు బాది జట్టును ఒంటిచేత్తో విజయ తీరాలకు చేర్చాడు. ఈ ప్రదర్శనతో రాత్రి రాత్రి ముకుల్‌ ఐపీఎల్ స్టార్‌గా ఎదిగాడు. అయితే ఈ విజయం వెనుక అతని తండ్రి దలీప్ చౌదరి కఠోర శ్రమ, త్యాగం ఉంది. 

2004లో మొదలైన తండ్రి కల 

ముకుల్ తండ్రి దలీప్ చౌదరి తన కుమారుడి భవిష్యత్ గురించి 2003లోనే ఒక కల కన్నారు. 2003లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వివాహం చేసుకున్న సమయంలోనే తనకు కొడుకు పుడితే కచ్చితంగా క్రికెటర్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. 2004లో ముకుల్ జన్మించినప్పటి నుంచి దలీప్ తన సర్వస్వాన్ని కొడుకు కెరీర్‌ కోసమే ధారపోశాడు. చాలా మంది క్రికెటర్లు అవుతున్నప్పుడు నా కొడుకు ఎందుకు కాలేడు అనే పట్టుదలతతోనే ఆయన్ని ముందుకు నడిపించింది. 

ఆర్థిక ఇబ్బందులు వెంటడినా...

మొదట్లో దలీప్ చౌదరి రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షల కోసం ఆరేళ్లపాటు సిద్ధమయ్యారు. కానీ విజయం సాధించలేకపోయారు. అనంతరం రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించినప్పటికీ అక్కడ కూడా ఆర్థిక స్థిరత్వం లేదు. 2016లో ముకుల్‌ను రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో ఉన్న ఎస్‌బీఎస్ క్రికెట్‌ హబ్ అకాడమీలో చేర్పించారు. అయితే శిక్షణకు అవసరమైన నిధులు లేకపోవడంతో దలీప్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత ఇంటిని 21 లక్షలకు అమ్మేశారు. ఆ మొత్తాన్ని ముకుల శిక్షణ, ఇతర అవసరాల కోసం వెచ్చించారు. ఆ తర్వాత ఒక హోటల్ ప్రారంభించి, వ్యాపారం కోసం మరిన్ని అప్పులు చేశారు. 

జైలు జీవితం - సామాజిక వివక్ష

ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో అప్పులు తీర్చడం దలీప్‌కు భారంగా మారింది. బ్యాంక్ ఇన్ స్టాల్‌మెంట్లు సకాలంలో చెల్లించలేక ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. " నేను జైలుకు వెళ్లాను. కానీ నేను ఎవర్నీ మోసం చేయలేదు." అని దలీప్‌ గర్వంగా చెబుతారు. ఈ కష్టం కాలంలో బంధువులు, సమాజం నుంచి ఆయనకు ఎదురు దెబ్బలు తగిలాయి. బంధువులు ఆయన్ని పిచ్చివాడు అని పిలిచారు. " నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. కనీసం నీ కొడుకు జీవితాన్ని అయినా వదిలేయ్" అని ముఖం మీదే చెప్పేవారు. కానీ ఆ విమర్శలే తనను మరింత దృఢంగా మార్చాయని, తాను సరైన మార్గంలోనే ఉన్నానని నమ్మేలా చేశాయని దలీప్ గుర్తు చేస్తున్నారు. 

బౌలర్ నుంచి వికెట్ కీపర్‌ ఫినిషర్‌గా ముకుల్ ప్రయాణం

ముకుల్ చౌదరి తన కెరీర్‌ను మీడియా ఫాస్ట్ బౌలర్‌గా ప్రారంభించాడు. అయితే తన అకాడమీ జట్టులో వికెట్ కీపర్‌ లేకపోవడంతో ఆయన కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. మహేంద్ర సింగ్ ధోనీని ఆరాధించే ముకుల్‌, తన బ్యాటింగ్‌లో కూడా ధోనీ లాంటి ఫినిషర్ లక్షణాలను అలవరుచుకున్నాడు. కేకేఆర్‌ మీద సాధించిన విజయం  తర్వాత ముకుల్‌ ఈ ఇన్నింగ్స్‌ను తన తండ్రికి, తన ఆరాధ్య దైవం ధోనీకి అంకితం ఇచ్చాడు.