IPL 2025 CSK VS KKR Updates: చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ గా ఎంఎస్ ధోనీ నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే. మోచేతి గాయం కార‌ణంగా రెగ్యుల‌ర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజ‌న్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. ఈ సీజ‌న్ లో చెన్నై అంతంత‌మాత్రంగానే ఆడుతోంది. అటు బౌల‌ర్ల వైఫ‌ల్యంతోపాటు, ఇటు మిడిలార్డ‌ర్ విఫలం కావ‌డం, వేగంగా ప‌రుగులు సాధించ‌లేక పోవ‌డం ఆ జ‌ట్టుకు శాపంగా మారాయి. బ్యాటింగ్ లో రుతురాజ్ ఒక్కడే రాణిస్తున్నాడు. తాజాగా అత‌ను కూడా దూరం కావ‌డంతో మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్లు.. చెన్నై ప‌రిస్థితి దీనంగా మారిపోయింది. దీంతో ఆ జ‌ట్టు బ్యాటింగ్ ఆర్డ‌ర్ కూర్పుపై ప‌లు సందేహాలు నెల‌కొంటున్నాయి. ముఖ్యంగా రుతురాజ్ ను భ‌ర్తీ చేసే ఆట‌గాడు ఎవ‌రా..? అని ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. రుతురాజ్ గైర్హాజ‌రీలో రాహుల్ త్రిపాఠిని త‌ప్పనిస‌రిగా టాపార్డ‌ర్ లో ఆడించాల్సిన ప‌రిస్థితిలో సీఎస్కే నిలిచింది. తొలి మూడు మ్యాచ్ ల్లో ఓపెన‌ర్ గా బ‌రిలోకి దిగిన రాహుల్.. పూర్తిగా నిరాశ ప‌ర్చాడు. ఆ త‌ర్వాత అత‌డిని ప‌క్క‌న పెట్టారు. అయిన‌ప్ప‌టికీ, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో త‌న‌కు తుదిజ‌ట్టులో చోటు ద‌క్కడం ఖాయంగా మారింది. ఫామ్ కోల్పోయి తంటాలు ప‌డుతున్న రాహుల్ నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. 

మిడిలార్డ‌ర్ లో మార్పులు..ఇక సీఎస్కే మిడిలార్డ‌ర్లో మార్పులు, చేర్పులు కూడా అనివార్య‌మ‌య్యాయి. మ‌రో సీనియ‌ర్ ప్లేయ‌ర్ దీప‌క్ హూడా ను జ‌ట్టులోకి తీసుకోని ప‌రిస్థితి నెల‌కొంది. అత‌ను కూడా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ప‌డుతున్నాడు. వీరిద్ద‌రూ కాద‌నుకుంటే ఢిల్లీకి చెందిన యువ ప్లేయ‌ర్ వ‌నీశ్ బేడీ, ఆంధ్ర కుర్రాడు షేక్ ర‌షీద్ ల‌ను ఆడించ‌వ‌చ్చు. రుతురాజ్ కు రీప్లేస్మెంట్ గా ఎవరినైనా తీసుకునే అవకాశముంది. మ‌రోవైపు ఈ సీజ‌న్లో ఐదు మ్యాచ్ లు ఆడిన చెన్నై.. నాలిగింటిలో ఓడిపోయి, ఒక్క‌దానిలోనే విజ‌యం సాధించింది. మిగ‌తా తొమ్మిది మ్యాచ్ ల్లో క‌నిసం ఏడు మ్యాచ్ ల్లో విజ‌యం సాధిస్తేనే ప్లే ఆఫ్ బ‌రిలో ఉంటుంది. 

ధోనీ ఎప్పుడు రెడీ..ఇక రుతురాజ్ దూరం కావ‌డంతో జ‌ట్టును న‌డిపే భారం ధోనీపైనే ప‌డింది. 2008 నుంచి 2023 వ‌ర‌కు అప్ర‌తిహ‌తంగా చెన్నైని న‌డిపించిన ధోనీ.. జ‌ట్టుకు ఐదు టైటిల్స్ అందించాడు. ఇక గ‌త సీజ‌న్ నుంచి ప‌గ్గాలు రుతురాజ్ కు అందించ‌గా, క‌నీసం జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు కూడా చేర‌లేదు. మ‌ధ్య‌లో కూడా ఒక‌సారి ర‌వీంద్ర జ‌డేజాను కెప్టెన్ చేయ‌గా, అప్పుడు కూడా జ‌ట్టు అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. అప్పుడు కూడా ధోనీనే జ‌ట్టు ప‌గ్గాలు చేపట్టాడు. ఇక కొత్త సార‌థిపై జ‌ట్టు కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ విశ్వాసం వ్య‌క్తం చేశాడు. జ‌ట్టు క్లిష్ట ప‌రిస్థితులో ఉన్న‌ప్పుడు ఆదుకునేందుకు త‌నెప్పుడు సిద్దంగా ఉంటాడని, తాజాగా మ‌రోసారి త‌న నుంచి అలాంటి స్పంద‌న వ‌చ్చింద‌ని పేర్కొన్నాడు. ఏదేమైనా త‌లా ధోనీ కెప్టెన్ గా రాక‌తోనైనా సీఎస్కే ప‌రిస్థితి మెరుగు ప‌డుతుంద‌ని స‌గ‌టు చెన్నై అభిమాని ఆశ‌ప‌డుతున్నాడు. ఇక శుక్ర‌వారం డిఫెండింగ్ చాంపియ‌న్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుతో మ్యాచ్ ద్వారా రెగ్యుల‌ర్ కెప్టెన్ గా ధోనీ బ‌రిలోకి దిగుతున్నాడు.