MS Dhoni Hits Longest Six Of IPL 2024 : ఐపీఎల్‌(IPL)లో మిస్టర్‌ కూల్‌, టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడి మహేంద్రసింగ్‌ ధోనీ(MS Dhoni ) కెరీర్‌ ముగిసిందన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు(RCB)తో జరిగిన మ్యాచ్చే ధోనికి ఐపీఎల్‌ఎలో చివరి మ్యాచ్‌ అని చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ చివరి మ్యాచ్‌లో 13 బంతుల్లో 25 పరుగులు చేసిన ధోనీ... ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో అవుటై నిరాశగా వెనుదిరిగాడు. చివరి ఆరు బంతుల్లో పదిహేడు పరుగులు చేయాల్సిన దశలో యశ్‌ దయాల్‌ వేసిన చివరి ఓవర్‌లో తొలి బంతికే ధోనీ భారీ సిక్సర్‌ కొట్టాడు. ఇప్పుడు ఆ సిక్సరే... ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనే భారీ సిక్సర్‌గా నిలిచింది.






 

ఈ ఐపీఎల్‌లోనే భారీ సిక్సర్‌

రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యత‌లు అప్పగించిన‌ప్పటి నుంచి ధోనీ చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో చివరి ఓవర్‌లో ఇప్పటికే కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ధోనీ... బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ రాణించాడు. ధాటిగా బ్యాటింగ్‌ చేసి 13 బంతుల్లో 25 పరుగులు చేసి చెన్నైను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నించాడు. యశ్‌ దయాలు వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికి ధోనీ 110 మీటర్ల సిక్స్‌ బాదాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనే ఇదే భారీ సిక్సర్‌ కావడం గమనార్హం. యశ్ దయాల్ వేసిన బంతి మిడిల్ -లెగ్‌పై టాస్‌గా పడింది. ఈ బంతిని అందుకున్న ధోనీ.. ఫైన్ లెగ్ దిశగా భారీ సిక్సర్‌ బాదాడు. ఆ సిక్స్ దాదాపుగా 110 మీటర్ల దూరం పడింది. అంతే చెన్నై లక్ష్యం అయిదు బంతుల్లో 11 పరుగులకు తగ్గింది. అ తర్వాతి బంతికే ధోనీ అవుట్‌ కావడంతో బెంగళూరు గెలిచి ప్లే ఆఫ్‌కు చేరింది. 

 

చివరి ఓవర్‌ అంటే ధోనీనే

చివ‌రి ఓవ‌ర్‌లో ధోనీ క్రీజులో ఉంటే అంతే సంగ‌తులు. బౌల‌ర్‌పై ఫోర్లు, సిక్సర్ల‌తో విరుచుకుప‌డ‌తాడు. ఇలా ఐపీఎల్ 20వ ఓవర్‌లో ధోనీ ఇప్పటివరకు 66 సిక్సర్లు కొట్టాడు. ఈ సీజ‌న్‌లోనూ ధోనీ 5 ఇన్నింగ్స్‌లలో 255.88 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా 5000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ధోనీ ఉన్న ఫామ్‌ను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

 

రికార్డుల కింగ్‌ కోహ్లీ

మంచి ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే రెండు సీజన్లలో 700కుపైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా విరాట్‌ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్‌ గేల్ మాత్రమే 2012లో 733, 2013లో 708 పరుగులు చేశాడు. వరుస సీజన్లలో ఇన్ని పరుగులు చేసిన ఆటగాడు మరెవరూ లేరు. గేల్‌, కోహ్లీ ఇద్దరు బెంగళూరుకే ప్రాతినిథ్యం వహించడం విశేషం. గేల్‌ మైదానంలో చూస్తుండగానే కోహ్లీ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.