MS Dhoni Fan Travels Delhi To Chennai On Cycle: మిస్టర్‌ కూల్‌, టీమిండియా దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోని(MS Dhoni)కి అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోనీ ఒక్కసారి కనిపిస్తే చాలు ధోనీ నామస్మరణతో మైదానాలు మార్మోగిపోతాయి.  ధోనీని కలుసుకోవాలని, అతని ఆటోగ్రా్‌ఫతో పాటు ఫొటో తీసుకోవాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అదే కోరికతో ఢిల్లీ(Delhi)లో ఉంటున్న గౌరవ్‌ అనే యువకుడు సైకిల్‌(cycle)పై 23 రోజులు ప్రయాణించి చెన్నై చేరుకున్నాడు. చెన్నై(Chennai)లోని ప్రసిద్ధ చెపాక్‌ మైదానం సమీపంలో గుడారం వేసుకుని ధోనీని కలిసేందుకు ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో, పోలీసులు అక్కడకు చేరుకుని గౌవర్‌ను విచారించి అతడి కోరిక తెలుసుకొని అభినందించడంతో పాటు నచ్చచెప్పి పంపించారు.


చెన్నై కీలక మ్యాచ్‌

చెన్నై సూపర్ కింగ్స్(CSK) పాయింట్ల పట్టకలో మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్‌ గైక్వాడ్‌ సేన 14 పాయింట్లు, 0.528 NRRతో ప్లే ఆఫ్‌ రేసులో ఉంది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెన్నై బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లే-ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశం మెరుగుపడుతుంది. ఒకవేళ చెన్నై చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడితే, మంచి నెట్ రన్ రేట్ కారణంగా ప్లే ఆఫ్‌ చేరుకోవచ్చు. కానీ అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

 

మే 18న కీలక పోరు

మే 18వ తేదీన ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనే కీలక సమరం జరగనుంది. ప్లే ఆఫ్‌ చేరాలని గంపెడు ఆశలు పెట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌తో.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్‌ అవకాశాలు మెరుగవ్వడంతో ఈ మహామహుల యుద్ధం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌... రాజస్థాన్‌ మాత్రమే ప్లే ఆఫ్‌కు చేరాయి. మరో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌ కీలకంగా మారింది. అయితే క్రికెట్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

 

పొంచి ఉన్న వర్షం ముప్పు

ఇంతటి కీలకమైన మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచిఉంది. మ్యాచ్‌ జరిగే రోజున బెంగళూరులో వర్షం కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని వెదర్.కామ్‌ వెల్లడించింది. రోజంతా 73 శాతం, సాయంత్రం 6 గంటల సమయంలో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సదరు వెబ్‌సైట్‌ పేర్కొంది.