MS Dhoni Retirement | ఐపీఎల్ సీజన్ మొదలయ్యే సమయంలో, చివరి మ్యాచ్ రోజు ఎక్కువగా జరిగే చర్చ ధోని (Dhoni) రిటైర్మెంట్ అంశంపై జరుగుతోంది. ఇటీవల జరిగిన మ్యాచ్ లో ధోనీ తల్లిదండ్రులు స్టేడియానికి వచ్చి మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించడంతో CSK మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని.. ఇదే సీజన్ చివరిదని ప్రచారం ఊపందుకుంది. అయితే మ్యాచ్ తరువాత ధోనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో బ్యాటింగ్ చూసిన తర్వాత ధోని రిటైర్ అవుతాడా అని మరోసారి చర్చ మొదలైంది.
ధోని మనసులో ఏముంది..రిటైర్మెంట్ గురించి ధోని మాట్లాడాడు. రాజ్ సమానితో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఆలోచన నా మనసులో లేదు. ప్రస్తుతం నా వయసు 43 ఏళ్లు. ఈ జూలైలో 44 ఏళ్లు వస్తాయి. వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి అంటే ఐపీఎల్ తరువాత మరో 10 నెలల టైమ్ ఉంటుంది. ఆ సమయంలో నా శరీరం సహకరిస్తుందా లేదా అనే దానిపై నా రిటైర్మెంట్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఆ సమయంలో బాడీ ఇదే విధంగా సహకరిస్తే కచ్చితంగా వచ్చే సీజన్ లోనూ ఆడతానని ధోనీ స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చాడు. అంటే ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత సైతం ధోనీ తన రిటైర్మెంట్ పై ఎలాంటి ప్రకటన చేయడం లేదని అర్థం చేసుకోవచ్చు.
మన జీవితంలో కొందరు మంచి వ్యక్తులనే కాదు చెడ్డ వారిని సైతం కలుసుకుంటాం. ఎవరైనా మనల్ని మోసం చేశారని, మిగతా అందరినీ నమ్మకపోవడం చేయకుండా ముందుకు సాగాలి. కొందరు వ్యక్తులు మన జీవితంలో భాగం అయి, మన సంతోషానికి కారణం అవుతారని పాడ్ కాస్ట్‌లో ధోనీ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఎంఎస్ ధోనీ ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్. చెన్నై జట్టుకు 5 సార్లు కెప్టెన్‌గా ట్రోఫీని అందించిన ఘనత ధోనీ సొంతం. వాస్తవానికి మోకాలి నొప్పి కారణంగా ధోనీ ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అయితే కీపింగ్ లో మాత్రం ఇప్పటికీ ధోనీ వేగం అటు ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ సీజన్‌లోనూ రెండు మెరుపు స్టింపింగ్స్ తో కీపర్ గా సత్తాచాటిన ధోనీ.. బ్యాటింగ్‌లో ఆశించిన మేర రాణించడం లేదు. బంతికో పరుగు చొప్పున చేస్తున్నాడని విమర్శలు సైతం వస్తున్నాయి.
బీసీసీఐ రూల్స్ కారణంగా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా చెన్నై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఆడుతున్నాడు. 268 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ 5,319 పరుగులు చేశాడు. అందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వయసు మీద పడటంతో యువకులతో పోటీ పడి బ్యాటింగ్ చేయలేకపోవడం విమర్శలకు దారితీస్తోంది.