Sunrisers Hyderabad vs Mumbai Indians: ఐపీఎల్‌ 2023 సీజన్‌లో జరుగుతున్న 69వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. రైడర్స్ బ్యాటర్లలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (83: 46 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు), వివ్రాంత్ శర్మ (69: 47 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. ముంబై బౌలర్లలో ఆకాష్ మధ్వాల్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.


ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు వివ్రాంత్ శర్మ (69: 47 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు), మయాంక్ అగర్వాల్ (83: 46 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరును పరుగెత్తించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ సీజన్‌లో అతి పెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యం ఇదే.


ఐపీఎల్ చరిత్రలోనే ఆడిన మొదటి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా వివ్రాంత్ శర్మ నిలిచాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంత వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 220 నుంచి 230 పరుగుల వరకు చేస్తుందనిపించింది. కానీ ఆకాష్ మధ్వాల్ వీరిద్దరినీ అవుట్ చేశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ స్కోరింగ్ వేగం కూడా మందగించింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్ నాలుగు వికెట్లు, క్రిస్ జోర్డాన్ ఒక వికెట్ పడగొట్టారు.


పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ రెండో స్థానంలోనూ, సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి స్థానంలోనూ ఉన్నాయి. టోర్నీలో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ముంబైకి ఈ విజయం చాలా ముఖ్యం. నెట్ రన్‌రేట్ కూడా ముఖ్యమే కాబట్టి ముంబై భారీ తేడాతో గెలిస్తే ఇంకా మంచిది. సన్‌రైజర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. కాబట్టి గెలిచినా ఓడినా వారికి పోయేదేమీ లేదు. కానీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో చివర నిలిచే అవమానం తప్పుతుంది.




సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్


సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అకేల్ హోసేన్, అబ్దుల్ సమద్


ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్


ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
రమణదీప్ సింగ్, విష్ణు వినోద్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, సందీప్ వారియర్