MI vs RCB IPL 2024 Head to Head records : ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై(MI)తో బెంగళూరు(RCB) అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ కూడా వరుసగా విఫలమవుతున్నా గత మ్యాచ్‌లో విజయం సాధించి ఈ ఐపీఎల్‌లో తొలి విజయం నమోదు చేసింది. బెంగళూరు ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అయిదు మ్యాచులు ఆడగా కేవలం ఒకే విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో ముంబై తర్వాతి స్థానంలో ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది. దాదాపుగా ముంబై కూడా అదే స్థితిలో ఉంది. ముంబై ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది. 

 

హెడ్‌ టు హెడ్‌ రికార్డులు

ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 32 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 18 మ్యాచుల్లో విజయం సాధించగా.... బెంగళూరు 14 మ్యాచుల్లో విజయం సాధించింది. అన్ని మ్యాచుల్లోనూ ఫలితం వచ్చింది. ముంబైపై బెంగళూరు అత్యధిక స్కోరు 235 పరుగులు కాగా... బెంగళూరుపై ముంబై అత్యధిక స్కోరు 213 పరుగులు. బెంగళూరు అత్యల్ప స్కోరు 122 పరుగులు కాగా.. ముంబై అత్యల్ప స్కోరు 111 పరుగులు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచుల్లో విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్ అద్భుత గణాంకాలు కలిగి ఉన్నారు. ముంబైపై విరాట్‌ కోహ్లీ ఇప్పటివరకూ 852 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ 786 పరుగులు చేశాడు. ముంబై తరుపున కెప్టెన్ రోహిత్ శర్మ 793 పరుగులు, కీరన్ పొలార్డ్ 551 పరుగులు చేశారు. బౌలర్లలో ముంబై స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా 24 వికెట్లు తీయగా, యుజ్వేంద్ర చాహల్ 22 వికెట్లు తీశాడు. హర్భజన్ సింగ్ 18 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

 

బ్యాటర్లు మెరుస్తారా..?

బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లి ఒక్కడే భారాన్ని మోస్తున్నాడు. ఈ ఐపీఎల్‌లో తొలి శతకం నమోదు చేసి మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీకి ఇతర బ్యాటర్ల నుంచి మద్దతు కరువవుతోంది. RCB నాకౌట్‌ చేరాలంటే ఇక్కడి నుంచి ప్రతీ మ్యాచ్‌ కీలకం కావడంతో మిగిలిన బ్యాటర్లు కూడా జూలు విధించాల్సి ఉంది. ఐపీఎల్‌లో తొలి దశ మ్యాచులో ముగుస్తున్నా బెంగళూరు బ్యాటర్లు పూర్తిగా గాడిన పడలేదు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (109 పరుగులు), గ్లెన్ మాక్స్‌వెల్ (32), కామెరాన్ గ్రీన్ (68)లతో ఇప్పటివరకూ దారుణాంగా విఫలమయ్యారు. కోహ్లి మాత్రం భీకర ఫామ్‌లో ఉన్నాడు. 146.29 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో కోహ్లీ 316 పరుగులు చేశాడు. ఐదు నెలల క్రితం వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‌లో తన 50వ వన్డే సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ మరోసారి ఈ మైదానంలో బరిలోకి దిగుతున్నాడు. తనకు 50 వ సెంచరీ మధుర జ్ఞాపకాలను ఇచ్చిన వాంఖడేలో మళ్లీ విజృంభించాలని కోహ్లీ గట్టి పట్టుదలతో ఉన్నాడు.

 

జట్లు:

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్. 

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ దీప్, ఆకాశ్‌కుమార్, వైషక్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కుర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.