Kolkata Knight Riders vs Royal Challengers Bangalore: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి పరాభవం ఎదురైంది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 81 పరుగులతో ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్ అయింది.


అదరగొట్టిన కోల్‌కతా స్పిన్నర్లు
205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఇన్నింగ్స్ పాజిటివ్ నోట్‌తోనే ప్రారంభం అయింది. లక్ష్యం భారీగా ఉండటంతో ఓపెనర్లు విరాట్ కోహ్లీ (21: 18 బంతుల్లో, మూడు ఫోర్లు), ఫాఫ్ డుఫ్లెసిస్ (23: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి బంతి నుంచే భారీ షాట్లు కొట్టడానికి ప్రయత్నించారు. మొదటి నాలుగు ఓవర్లలోనే బెంగళూరు వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది.


ఐదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సునీల్ నరైన్ తన మొదటి ఓవర్లోనే ఫాంలో ఉన్న విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే ఉంది. మిడిలార్డర్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. కోల్‌కతా స్పిన్నర్లు బంతిని బీభత్సంగా తిప్పేశారు. ఈ వికెట్‌పై వారికి మంచి టర్న్ కూడా లభించింది. దీంతో బెంగళూరు బ్యాటర్లను అస్సలు క్రీజులో కుదురుకోనివ్వలేదు. వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కొత్త కుర్రాడు సుయాష్ శర్మకు మూడు వికెట్లు దక్కాయి. సునీల్ నరైన్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు.


శార్దూల్ ఠాకూర్ షో
ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే కోల్‌కతాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (3: 7 బంతుల్లో), వన్ డౌన్ బ్యాటర్ మన్‌దీప్ సింగ్ (0: 1 బంతి), కెప్టెన్ నితీష్ రాణా (1: 5 బంతుల్లో) ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో కోల్‌కతా 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


అయితే మరో ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ (57: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), రింకూ సింగ్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. రహమనుల్లా గుర్బాజ్ తన అర్థ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ దశలో కరణ్ శర్మ కోల్‌కతాను గట్టి దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో క్రీజులో కుదురుకున్న రహమనుల్లా గుర్బాజ్, డేంజరస్ బ్యాట్స్‌మెన్ ఆండ్రీ రసెల్‌లను (0: 1 బంతి) వరుస బంతుల్లో అవుట్ చేశాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


ఇక కోల్‌కతా పని అయిపోయిందనుకున్న సమయంలో ఊహించిన ఉప్పెనలా శార్దూల్ ఠాకూర్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. తనకు రింకూ సింగ్ చక్కటి సహకారం అందించాడు. ఇన్నింగ్స్ ముందుకు సాగే కొద్దీ రింకూ కూడా వేగం పెంచాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు కేవలం 7.3 ఓవర్లలోనే 103 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రింకూ సింగ్,  20వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ అవుటయ్యారు. కానీ అప్పటికే బెంగళూరు భారీ స్కోరు కొట్టేసింది. 20 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. బెంగళూరు బౌలర్లలో కరణ్ శర్మ, డేవిడ్ విల్లీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. హర్షల్ పటేల్, బ్రేస్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లకు తలో వికెట్ దక్కింది.