IPL 2025 CSK 5th Loss in This Season: ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. కెప్టెన్ మారినా కూడా ఆ జట్టు రాత మారలేదు. టోర్నీలో అత్యంత అవమానకరంగా 8 వికెట్లతో ఓటమి పాలైంది. ఒకే సీజన్ లో వరుసగా ఐదు మ్యాచ్ లో ఓడిపోవడం సీఎస్కే కిదే తొలిసారి. శుక్రవారం చేపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో సీఎస్కే టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగుల స్వల్ప స్కోరు చేసింది. శివమ్ దూబే (29 బంతుల్లో 31, 3 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. సునీల్ నరైన్ కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనను కేకేఆర్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. 10.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 107 పరుగులు చేసి, గెలుపొందింది. సునీల్ నరైన్ (18 బంతుల్లో 44, 2 ఫోర్లు, 5 సిక్సర్లు)తో మెరుపు బ్యాటింగ్ చేయడంతో ఈజీ విక్టరీని సొంతం చేసుకుంది. నూర్ అహ్మద్ ఒక వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో తన మూడో స్థానాన్ని పటిష్టం చేసుకుంది.
మరోసారి బ్యాటింగ్ వైఫల్యం.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై.. బ్యాటింగ్ లో ఈసారి మరీ తీసికట్టు ప్రదర్శన చేసింది. ఆరంభంలోనే రచిన్ రవీంద్ర (4) వికెట్ కోల్పోయిన సీఎస్కే.. ఆ తర్వాత వరుస విరామాల్లో బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. డేవన్ కాన్వే (12) మరోసారి వేగంగా పరుగులు సాధించడంలో ఫెయిలయ్యాడు. ఈ దశలో విజయ్ శంకర్ (29) వేగంగా ఇన్నింగ్స్ ను కుదుట పరిచే ప్రయత్నం చేసి, ఔటయ్యాడు. వన్ డౌన్ లో దిగిన రాహుల్ త్రిపాఠి (16) త్వరగానే వెనుదిరిగాడు. దీంతో తన సహజశైలికి భిన్నంగా ఆడిన దూబే.. చివరికంటా అజేయంగా నిలిచినా, అతనికి సహకారం అందించే బ్యాటర్లు కరువయ్యారు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ (1) మళ్లీ 9వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి విమర్శల పాలయ్యాడు. మిగతా బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తికి రెండేసి వికెట్లు దక్కాయి.
సునీల్ ఆల్ రౌండ్ షో.. బౌలింగ్ లో మూడు వికెట్లు తీసిన సునీల్ నరైన్.. బ్యాటింగ్ లోనూ తన తడాఖా చూపించాడు. చిన్న టార్గెట్ కావడంతో మ్యాచ్ ను త్వరగా ముగించాలని భావించాడు. రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు కొట్టి ధనాధన్ ఆటతీరుతో అలరించాడు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (23) కూడా వేగంగా ఆడాడు. దీంతో 25 బంతుల్లోనే 46 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత డికాక్, నరైన్ ఔటైనా.. అజింక్య రహానే (20 నాటౌట్), రింకూ సింగ్ (15 నాటౌట్)తో కలిసి కేకేఆర్ ను విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో రింకూ.. ఐపీఎల్లో 1000 పరుగుల మార్కును దాటాడు.