Hardik Pandya And Natasa Stankovic: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు టైం బాగున్నట్లు కనిపించట్లేదు. ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే పాండ్యా ప్రస్తుతం పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏవో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి హార్థిక్ పాండ్యా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్ లో గొప్పగా రాణిస్తాడని ఆశ పడ్డ అందరికీ నిరాశనే మిగిల్చిన పాండ్యా ఈ సీజన్‌లో ముంబై దారుణమైన ప్రదర్శనకు బాధ్యుడయ్యాడు. అయిదు సార్లు కప్ గెలిచిన ముంబై పాండ్యా సారథ్యంలో కనీసం లీగ్ దశ కూడా దాటలేదు. ఆడిన పద్నాలుగు మ్యాచుల్లో పది మ్యాచ్‌లలో ఓటమి పాలై ఈ సారి పాయింట్ల టేబుల్ లో అట్టడుగు స్థానానికే పరిమితమైంది.
ముంబై కెప్టెన్సీ కొంప ముంచిందా..?
ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి సారధ్య బాధ్యతలు హార్థిక్ చేతిలో పెట్టడంపై క్రికెట్ అభిమానుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. నిర్ణయం తీసుకుంది టీం యాజమాన్యమైనా.. ఒత్తిడికి గురైంది మాత్రం హార్థిక్ పాండ్యానే. ముంబై టీమ్ ఈ సీజన్ లో ఓడిన ప్రతిసారీ నిందించింది పాండ్యానే. అందుకు తగ్గట్టుగానే టీమ్ సమష్టికా విఫలమవ్వడంతో ఈ సారి ముంబై ప్రదర్శన ఐపీఎల్ లో మరీ దారుణంగా ఉంది. ఈ టీమేనా ఇన్ని సార్లు టైటిల్ గెలిచింది.. అన్నంత ఆశ్చర్యకరంగా ఆటతీరుతో నిరాశకు గురిచేశారు పాండ్యా సారథ్యంలోని ముంబై ప్లేయర్లు. అసలు IPL 2024 టోర్నమెంటే ముంబై ఇండియన్స్‌కు ఒక పీడకలగా పరిణమించినట్లు కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా తన క్రికెట్ కెరీర్‌లో అత్యంత టఫ్ టైమ్ ని ఎదుర్కొంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తీవ్రమైన ట్రోలింగ్ కు గురైన పాండ్యా.. తన వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
భార్య నుంచి విడిపోయాడా..?
హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలోను సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. భార్య నటాషా స్టాంకోవిచ్ తో హార్దిక్ కు విభేదాలు తలెత్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ విడిపోయారని నెట్టింట ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రికెట్‌లో ఎక్కువగా మాట్లాడుకునే జంట హార్దిక్-నటాషా. ఈ జంట ప్రతి క్షణాన్ని సోషల్ మీడియాలో అప్‌డేట్ చేసుకోవడం అభిమానులు చూశారు. అలాంటిది సడన్ గా వీరు ఎవరి దారి వారిదే అన్నట్లు పోస్టులు చేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.
ఇంటిపేరు తొలగించి.. కష్టంలో వదిలేసి..
హార్థిక్ భార్య నటాషా ఇన్‌స్టా గ్రామ్‌లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్‌స్టాలో ఆమె ఖాతాకు 3.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. స్వతహాగా మోడల్, నటి అయిన నటాషా తన వ్యక్తిగత ఫొటోలతో పాటు తన ఫ్యామిలీ ఫొటోలు, ప్రొఫెషన్ ఫోటోలను సైతం తన ఖాతా ద్వారా షేర్ చేస్తుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం నటాషా గ్రౌండ్ లో ఎక్కడా కనిపించలేదు. పాండ్యా ఇంత బ్యాడ్ టైమ్ లో ఉన్నప్పుడు అతణ్ని సపోర్ట్ చేసేందుకు వెన్ను దన్నుగా నిలవలేదు. కనీసం సోషల్ మీడియాలో నైనా ఒక్క సపోర్టింగ్ పోస్టు కూడా పెట్టలేదు. అలాగే ఇన్‌స్టాగ్రామ్ లో నటాషా స్టాంకోవిక్ అనే తన పేరు చివర గతంలో ఉండే పాండ్యా అనే ఇంటిపేరును సైతం ప్రస్తుతం ఆమె తొలగించింది. ఇదేంటని పాండ్యా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదేం..?
ఇన్‌స్టాలో పాండ్యా ఖాతాకు సైతం 29.8 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. పాండ్యా కూడా అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాడు. అలాంటిది పాండ్యా కూడా తన భార్య నటాషా గురించి మాట్లాడటం, ఆమె వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం గత కొంతకాలంగా మానేశాడు. మార్చి 4న నటాషా పుట్టినరోజు కాగా.. ఆ రోజు కూడా ఒక్క పోస్టు కూడా భార్య పేరుమీద చేయలేదు. దీంతో వీరిద్దరూ విడిపోబోతున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. దీంతో బ్రేకప్ రూమర్లు వైరల్ అవుతున్నాయి. వీళ్లిద్దరూ 2020లో పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. వీరి రిలేషన్ షిప్ పై రూమర్స్ వస్తున్నా ఇంతవరకు వారు ఈ రూమర్స్ పై స్పందించలేదు. అలాగే విడిపోతున్నామంటూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.