Will Stephen Fleming Take Charge As The Next Head Coach Of India : భారత్ క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్ పదవకి సీఎస్‌కే టీమ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పోటీలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై సీఎస్‌కే సీఈవో సైతం స్పందించారు. 2021 నుంచి భారత్ హెడ్ కోచ్ గా ఉన్న ద్రావిడ్ పదవీ కాలం ఈ టీ 20 ప్రపంచ కప్ తో ముగుస్తుండటంతో  కొత్త కోచ్ నియామకంపైపు బీసీసీఐ దృష్టి పెట్టింది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు క్రికెట్ అడ్వయిజరీ కమిటీ షార్ట్ లిస్టు చేసిన అభ్యర్తుల్ని ఇంటర్వ్యూ చేసే లోపు..  స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా భారత్ కోచ్ పదవికి దరఖాస్తు చేయనున్నట్లు తెలుస్తోంది.

  ఐపీఎల్లో సూపర్ కింగ్స్ ని విజయవంతంగా నిలపడంలో ఫ్లెమింగ్ పాత్ర ఏంటో క్రికెట్ అభిమానులందరికీ తెలుసు. 2009లో ఆ టీముకు ప్రధాన కోచ్ గా నియమితుడైనప్పటి నుంచీ ధోనీతో కలిసి ఫ్లెమింగ్ సీఎస్‌కేను బలమైన టీమ్ గా మలచడంలో ప్రధాన పాత్ర పోషించాడు. 


ఫ్లెమింగ్ ఇష్టపడడేమో..!


సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్..ఈ విషయం పై మాట్లాడుతూ.. ‘‘వాస్తవానికి నాకు ఇండియన్ జర్నలిస్టుల నుంచి చాలా కాల్స్ వచ్చాయి. . స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇండియన్ కోచ్ గా మారేందకు సిద్దంగా ఉన్నారా అని అందరూ అడుగుతున్నారు. దీంతో నేను సరదాగా అతన్ని అడిగాను. నీకు ఇంట్రస్ట్ ఉందా..? దరఖాస్తు చేశావా అని. ఫ్లెమింగ్ పెద్దగా నవ్వి... ‘నీకు అనిపిస్తుందా ఈ పదవికి నేను అప్లై చేయాలని’ అని అన్నాడు అంతకు మించి మా మధ్య ఈ విషయం గురించి పెద్దగా డిస్కషన్ జరగలేదు. కానీ..  నాకు తెలుసు అతనికి ఈ పదవి సెట్ అవ్వదని. ఏడాదికి 9 నుంచి పది నెలల పాటు ఈ బాధ్యతల్లో ఉండటానికి ఫ్లెమింగ్ ఇష్టపడడని నా ఫీలింగ్’’ అని కాశీ విశ్వనాధన్  సీఎస్‌కే పోస్టు చేసిన ఒక వీడియోలో చేప్పారు.


2027 ప్రపంచ కప్ దాకా.. 


భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. బీసీసీఐ మే 13న ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ ఫైనల్ పూర్తయిన తరువాతి రోజు అంటే మే27 కల్లా దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో వివరించింది. ఈ పదవి కోసం  ఫారెన్ కోచ్ ల వైపే బీసీసీఐ మొగ్గుతోన్నట్లు తెలుస్తోంది.  ఇప్పుడు రాబోతోన్న కోచ్ 2027 డిసెంబర్ 31 వరకు కొనసాగుతాడు. 2027లో జరగబోయే వన్ డే  ప్రపంచకప్‌కి కూడా అతనే కోచ్ గా ఉంటాడు. 


ఫ్లెమింగ్ గురించి అవీ ఇవీ.. 


స్టీఫెన్ ఫ్లెమింగ్ న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌కి మాజీ కెప్టెన్. సీఎస్‌కే ప్రధాన కోచ్‌గా 2009 నుంచి వ్యవహరిస్తున్నాడు. సీఎస్‌కేను అయిదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన కోచ్ ఇతను. భారత్ ప్రధాన కోచ్ పదవికి ప్రధానంగా పోటీలో ఉన్న పేర్లలో ఫ్లెమింగ్ పేరు కూాడా వినిపిస్తోంది. ఇతను ఇంతకుముందు ప్రపంచంలోని చాలా టీమ్ లకు  టీ 20 ఫార్మాట్ లో కోచింగ్ ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రధాన కోచ్ గా ఉండటమే కాకుండా.. అమెరికాకు చెందిన మేజర్ లీగ్ క్రికెట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కి కోచింగ్ ఇచ్చాడు. సౌతాఫ్రికాలో ఎస్ఏ 20 లీగ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కి, హండ్రెడ్ అనే లీగ్ లో సదరన్ బ్రేవ్ టీమ్ కి కోచింగ్ ఇచ్చాడు.