IPL Mumbai Indians vs Gujarat Titans: ముంబై ఇండియ‌న్స్, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య పోరులో ఎవ‌రిది విజ‌యం అనే విష‌యం క‌న్నా.... ఎన్ని రికార్డులు బద్ద‌ల‌వుతాయ‌న్న దానిమీదే అంద‌రికీ ఆస‌క్తి ఎక్కువ‌. ఎందుకంటే ఈ జట్లలో ఆట‌గాళ్లు రికార్డుల రారాజులు. బ్యాటింగ్ మాత్ర‌మే కాదు, బౌలింగ్‌లో కూడా రికార్డ్‌లు క్రియేట్ చేసారు ఈ టీం ప్లేయ‌ర్లు. గ‌తంలో న‌మోదైన రికార్డ్‌లు మాత్ర‌మే కాదు వ్య‌క్తిగ‌తంగా సాధించిన రికార్డ్‌లు ఈ టీంల‌లో ఆట‌గాళ్ల‌ని శిఖ‌రాగ్రాన నిల‌బెట్టాయి. మ‌రి ఏంటా రికార్డులు? ఎవ‌రా ఆటగాళ్లు?... రండి ఓ లుక్కేద్దాం.


ఇదీ గ‌త రికార్డ్‌
ముందుగా ముంబై, గుజ‌రాత్ జ‌ట్ల మ‌ధ్య ఇప్ప‌టివ‌ర‌కు 4 మ్యాచ్‌లు జ‌రిగితే ముంబై రెండు మ్యాచ్‌లు గెలుపొందితే, గుజ‌రాత్ రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చివ‌రిసారి గ‌త సీజ‌న్‌లో త‌ల‌ప‌డినప్పుడు ముంబై 27 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఇక ఈ సీజ‌న్‌లో మ్యాచ్ జ‌రిగే అహ్మ‌దాబాద్ లో గుజ‌రాత్ టైటాన్స్ 8 మ్యాచ్‌లు ఆడి 5 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 3 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఇక  ఈ మైదానంలో మెత్తం ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు జ‌రిగితే మెద‌ట బ్యాటింగ్ చేసిన టీం 3 సార్లు, రెండ‌వ‌సారి బ్యాటింగ్ చేసిన టీం 4 సార్లు గెలుపొందింది. అత్య‌ధిక స్కోరు 207 ప‌రుగులుగా ఉంది.


ఈ టీంల‌్లో అత్య‌ధిక ప‌రుగుల వీరులుగా సూర్య‌కుమార్ 139, శుభ్‌మ‌న్‌గిల్‌114, డేవిడ్ మిల్ల‌ర్ లు 106 ప‌రుగుల‌తో ఉన్నారు. ఎక్కువ వికెట్లు సాధించిన వారిలో... ర‌షీద్ 8 వికెట్లు తీయ‌గా, పీయూష్ చావ్లా 4 వికెట్లు తీశారు. ఐపీఎల్ లో గుజ‌రాత్ టైటాన్స్‌ అత్య‌ధిక  స్కోర్ ముంబై ఇండియ‌న్స్ మీదే చేసింది. గ‌త 2023 సీజ‌న్లోనే ఈ ఘ‌న‌త సాధించింది గుజ‌రాత్. 2023 మే 26న ముంబై ఇండియ‌న్స్ తో అహ్మ‌దాబాద్ లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 20 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ 233 ప‌రుగులు సాధించింది. కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఈ స్కోరు సాధించింది టైటాన్స్‌. 


వీళ్ల ఆట ఆస‌క్తిక‌రం
ఇక మ్యాచ్‌లో శుభ్‌మ‌న్ గిల్ వికెట్ కోసం ముంబై బూమ్రాని రంగంలోకి దింపుతుంది. ఇన్నింగ్స్ ఆరంభించే గిల్ ని నియంత్రించాలి అంటే...  అది కూడా ఆరంభంలోనే జ‌ర‌గాలి అంటే బూమ్రానే కీల‌కం. దీంతో కెప్టెన్ పాండ్యా బూమ్రానే న‌మ్ముకొంటాడు. ప‌వ‌ర్‌ప్లేలో వీరి మ‌ధ్య ఆట‌ ఆస‌క్తి క‌లిగిస్తుంది. ఇక కేన్ విలియ‌మ్స‌న్ ని ఔట్ చేసే బాధ్య‌త పాండ్యా తీసుకోనున్నాడు. ఎప్ప‌టిలాగే ప‌వ‌ర్‌ప్లేలో ఒక ఓవ‌ర్ వేసి విలియ‌మ్స‌న్ కోసం వేచిచూస్తాడు. ఇక గుజ‌రాత్ విధ్వంస‌క ఆట‌గాడు డేవిడ్ మిల్ల‌ర్ ని అడ్డుకోవ‌డానికి మిడిల్ ఓవ‌ర్ల‌లో పీయూష్ చావ్లా బాధ్య‌త తీసుకొంటాడు. కాబ‌ట్టి  ఈ ఆట‌గాళ్లు కీల‌కం కానున్నారు రెండు టీంల‌కు.


అటు ముంబై బ్యాట్స్‌మెన్ రోహిత్‌శ‌ర్మ‌ని లిటిల్ కానీ, జాన్స‌న్ కానీ వీళ్లిద్ద‌రినీ ప్ర‌య‌త్నిస్తాడు గిల్‌. ఇక టిమ్‌డేవిడ్‌, బ్రేవిస్ ల‌ను అడ్డుకోవ‌డం ర‌షీద్ ఖాన్ వంతు. హార్డ్ హిట్ట‌ర్ లైన వీళ్ళిద్ద‌రిని అడ్డుకోవాలంటే ర‌షీదే క‌రెక్ట్‌. ప‌వ‌ర్‌ప్లే చివ‌రి ఓవ‌ర్‌లో బౌలింగ్ చేసే ర‌షీద్ మిడిలార్డ‌ర్లో వీరిని నియంత్రించ‌నున్నాడు. రాహుల్ తెవాటియా ముంబై మిడిలార్డ‌ర్ చేసే ప‌రుగుల నియంత్ర‌ణ‌కి అడ్డుక‌ట్ట వేసే ప‌ని చూసుకొంటాడు.


వేచి చూడాలి 
ఇలా ఛాంపియ‌న్ల ఆటంటే రికార్డులే రికార్డులు అనే ప‌రిస్థితి. ఇక కీల‌క ఆట‌గాళ్ల ప‌రుగుల దాహం, వికెట్ల వేటతో కొత్త రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయం. మ‌రి ఈ హైటెన్ష‌న్ మ్యాచ్‌లో మ‌రిన్ని రికార్డుల కోసం ఆదివారం 7.30 నిమిషాల‌కి అహ్మ‌దాబాద్ స్టేడియంకి ట్యూన్ కావ‌ల్సిందే.