2023 నుంచి 2027 సంవత్సరాలకు గానూ ఐపీఎల్ మీడియా రైట్స్ వేలం ముగిసింది. మొత్తంగా రూ.44,075 కోట్లకు టీవీ, డిజిటల్ హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. టీవీ హక్కులు ఒక బ్రాడ్‌కాస్టర్‌కు, డిజిటల్ హక్కులు మరో బ్రాడ్‌కాస్టర్‌కు దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. టీవీ రైట్స్‌ను సోనీ, డిజిటల్ హక్కులను వయాకాం18 దక్కించుకున్నాయని వార్తలు వస్తున్నాయి.


ఈ ఐదు సీజన్లలో 410 మ్యాచ్‌లు జరగనున్నాయి. అంటే దాదాపు ఒక్కో మ్యాచ్‌కు రూ.107.5 కోట్లకు హక్కులు అమ్ముడుపోయాయన్న మాట. టీవీ హక్కులు రూ.23,575 కోట్లకు, డిజిటల్ హక్కులు రూ.20,500 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.


రిటైల్ రంగ దిగ్గజం అమెజాన్ మధ్యలోనే రేసులో నుంచి వెనక్కి వచ్చేసినట్లు తెలుస్తోంది. 2017-2022 సీజన్లకు రూ.16,347.5 కోట్లకు స్టార్ ఇండియా ఈ హక్కులను దక్కించుకుంది. ఒక్కో మ్యాచ్‌కు సగటున రూ.55 కోట్లు అన్నమాట.


ఇక ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో 10 సంవత్సరాలకు కలిపి సోనీ పిక్చర్ రూ.8,200 కోట్లకు ఈ హక్కులను కొనుగోలు చేసింది. 2015లో నోవి డిజిటల్ అనే సంస్థకు గ్లోబల్ డిజిటల్ రైట్స్‌ను రూ.302.2 కోట్లకు బీసీసీఐ విక్రయించింది. 2022 సీజన్‌లో జట్ల సంఖ్యను ఎనిమిది నుంచి 10కి పెంచారు. కొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు వచ్చాయి. ఈ సీజన్‌ను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.