IPL Most Expensive Players: ఐపీఎల్ 2023 వేలానికి 24 గంటలు కూడా లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం శుక్రవారం (డిసెంబర్ 23) కొచ్చిలో జరుగుతుంది. టైటిల్‌ను దృష్టిలో ఉంచుకుని, చాలా ఫ్రాంచైజీలు బలమైన ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తాయి. ఈసారి వేలంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టగల కొందరు ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఐపీఎల్ వేలం చరిత్రలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఎవరో ఒకసారి చూద్దాం.


క్రిస్ మోరిస్
ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ పేరిట ఉంది. ఐపీఎల్ 2021 వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతనిని రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు క్రిస్ మోరిసే.


యువరాజ్ సింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. ఈ డాషింగ్ ఆల్ రౌండర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) 2015 సంవత్సరంలో రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది.


పాట్ కమిన్స్
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన క్రికెటర్లలో ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్ మూడో స్థానంలో నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ అతనిని రూ. 15.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో అతనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడు.


ఇషాన్ కిషన్
టీమ్ ఇండియా రైజింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ ఐపీఎల్‌లో నాలుగో అత్యంత ఖరీదైన ఆటగాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అతడిని ఏకంగా రూ.15.25 కోట్లకు కొనుగోలు చేసింది.


కైల్ జేమీసన్
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన కైల్ జేమీసన్ ఐదో స్థానంలో ఉన్నాడు. 2021 IPL వేలం సమయంలో అతని కోసం పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య యుద్ధం జరిగింది. చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. జేమీసన్‌ను రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది.