ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఐదోసారి కప్ కొట్టేసింది. కుర్రాళ్లు ఆల్‌రౌండర్ ప్రదర్శనలతో అల్లాడించారు. కప్ తెచ్చిన వెంటనే ఐపీఎల్ వేలం జరుగుతుండటంతో యువ క్రికెటర్లపై అంచనాలు భారీగా ఉన్నాయి. కొందరు రూ.1-3 కోట్ల వరకు ధర పలకొచ్చని విశ్లేషకులు అంటున్నారు. కెప్టెన్ యశ్‌ధుల్, ఆంధ్రా కుర్రాడు షేక్ రషీద్, రాజ్ బవాకు మంచి ధర వస్తుందని అంచనా.
యశ్ ధుల్ । Yash Dhull
టీమ్‌ఇండియాను టోర్నీ సాంతం అద్భుతంగా నడిపించాడు కెప్టెన్ యశ్ ధుల్. టోర్నీలోనే కరోనా బారిన పడ్డ అతడు తిరిగొచ్చాక దంచికొట్టాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌పై వరుసగా అర్ధశతకాలు సాధించాడు. ఇక సెమీస్‌లో అతడు చేసిన శతకానికి చాలామంది సీనియర్ క్రికెటర్లు ఫిదా అయ్యారు. వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం అందించాడు. ఇంగ్లాండ్‌పై ఫైనల్లో కీలకంగా నిలిచాడు.
షేక్ రషీద్ । Shaik Rasheed
ఈ గుంటూరు కుర్రాడు దాదాపుగా విరాట్ కోహ్లీ పాత్ర పోషిస్తున్నాడు. వన్‌డౌన్‌లో వస్తూ కీలక భాగస్వామ్యాలు అందిస్తున్నాడు. అవసరమైనప్పుడు దూకుడుగా ఆడతాడు. వికెట్లు పడుతుంటే నిలకడగా పరుగులు చేస్తాడు. వైస్ కెప్టెన్‌గా ఉంటూ యశ్‌కు అండగా నిలుస్తున్నాడు. సెమీస్‌లో ఆసీస్‌పై అతడు 90+ పరుగులు చేశాడు. బంగ్లాపై 72తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ఫైనల్లో ఛేదనలో ఓపెనర్లు త్వరగా ఆలౌటవ్వడంతో క్రీజులోకి వచ్చి అర్ధశతకం సాధించాడు.
విక్కీ ఓత్వ్సల్ । Vicky Ostwal
గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తున్నాడు విక్కీ. దక్షిణాఫ్రికాపై ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. పిచ్, వాతావరణాన్ని బట్టి బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. చక్కని వైవిధ్యం ప్రదర్శిస్తున్నాడు. పేస్ బౌలర్లతో కలిసి బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఫైనల్లో ఆంగ్లేయులను తన స్పిన్‌తో కట్టడి చేశాడు.
అంగ్‌క్రిష్ రఘువంశీ । Angkrish Raghuvanshi
రఘువంశీ రూపంలో టీమ్‌ఇండియాకు భవిష్యత్తు ఆల్‌రౌండర్ కనిపిస్తున్నాడు. ఉగాండాపై అతడు 144 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. శ్రీలంక పైనా అర్ధశతకంతో చెలరేగాడు. అవసరమైన ప్రతిసారీ బంతితోనూ ప్రతిభ కనబరిచాడు. ఫైనల్లో డకౌట్ అయినా అతడి ప్రతిభకేం తక్కువ లేదు.
హర్‌నూర్ సింగ్ । Harnoor Singh
టీమ్‌ఇండియా కరోనాతో ఇబ్బంది పడ్డప్పుడు హర్‌నూర్ సింగ్ ఆదుకున్నాడు. తన ఓపెనింగ్‌తో మెరుపులు మెరిపించాడు. ఐర్లాండ్‌పై అతడు చేసిన 88 పరుగులు అద్భుతమే! మిగతా మ్యాచుల్లో ఎక్కువ పరుగులు చేయలేదు కానీ సామర్థ్యం మేరకు ఆడితే తిరుగుండదు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లను చక్కగా ఎదుర్కోగలడు. మెరుగైన భాగస్వామ్యాలు చేయగల సత్తా అతడిలో ఉంది. ఫైనల్లోనూ ఫర్వాలేదనిపించాడు.
రాజ్ అంగద్ బవా । Raj Bawa
క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చాడు రాజ్ అంగద్ బవా. ఎడమచేత్తో బ్యాటింగ్, కుడిచేత్తో పేస్ బౌలింగ్ వేయడంలో ఇతడు దిట్ట. వినోద్ మన్కడ్, ఛాలెంజర్స్ ట్రోఫీల్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆసియాకప్‌లో 8 వికెట్లతో మెరిశాడు. అండర్-19 ప్రపంచకప్‌లో ఉగాండాపై 108 బంతుల్లో 162 పరుగులతో అజేయంగా నిలిచి శిఖర్ ధావన్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక ఇంగ్లాండ్‌పై ఫైనల్లో దుమ్మురేపాడు. 9.5 ఓవర్లలో 31 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. టాప్ ఆర్డర్ త్వరగా ఔటవ్వడంతో టీమ్‌ఇండియాను గెలిపించేందుకు 35 పరుగులు చేశాడు. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకోవాలంటే కనీసం ఒక లిస్ట్-ఏ మ్యాచైనా ఆడాలి. లేదా 19 ఏళ్లు దాటాలి. కరోనా వైరస్ వల్ల గతేడాది దేశవాళీ క్రికెట్ సరిగ్గా జరగలేదు. దాంతో పైన చెప్పిన కొందరు ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడలేదు. కప్ గెలచుకొచ్చారు కాబట్టి నిబంధన సడలించాలని చాలామంది కోరుతున్నారు. ఒకవేళ బీసీసీఐ ఈసారి ఆ నిబంధనను సవరిస్తే కుర్రాళ్లను అదృష్టం వరించినట్టే!