IPL Mega Auction: ఐపీఎల్ 15వ సీజన్ వినూత్నంగా ప్రారంభం కావడానికి సిద్ధం అవుతుంది. ఇప్పుడు కొత్తగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్లు కూడా చేరడంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరింది. ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనుంది. జట్లు రిటైన్ చేసుకున్న 33 మంది కాకుండా మొత్తంగా 590 మంది ఆటగాళ్ల కోసం జట్లు పోటీపడనున్నాయి.
ఐపీఎల్ 2022 మెగా వేలాన్ని లైవ్ చూడటం ఎలా?
ఈ ఐపీఎల్ మెగా వేలం బెంగళూరులో జరగనుంది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ వేలం జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ హెచ్‌డీలో ఈ వేలాన్ని లైవ్‌లో చూడవచ్చు. అలాగే డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో కూడా ఈ మెగా వేలాన్ని లైవ్‌లో చూడవచ్చు.
ఈ వేలంలో మొత్తంగా 590 మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఆటగాడికి ఫిక్స్‌డ్ బేస్ ప్రైస్ ఉంటుంది. అత్యధిక బేస్ ప్రైస్ రూ.2 కోట్లుగా ఉంది. మొత్తంగా 48 మంది ఆటగాళ్లు తమ బేస్ ప్రైస్‌ను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో 20 మంది ఆటగాళ్లు ఉన్నారు.
వేలానికి పేర్లు నమోదు చేసుకున్న 590 మందిలో 228 మంది జాతీయ జట్లకు ఆడినవారు ఉన్నారు. అలాగే అసోసియేట్ దేశాల నుంచి ఉన్న ఆటగాళ్లు ఏడుగురు ఉన్నారు. వేలంలో అందుబాటులో ఉన్న వారిలో 370 మంది ఆటగాళ్లు భారతీయులు కాగా, 220 మంది విదేశీయులు ఉన్నారు.
ఈ మెగా వేలంలో అత్యధిక నిధులు పంజాబ్ కింగ్స్ వద్ద ఉన్నాయి. వారు రూ.72 కోట్లతో బరిలోకి దిగనుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అతి తక్కువగా రూ.47 కోట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి 47 మంది, వెస్టిండీస్ నుంచి 34 మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు.