Vaibhav Sooryavanshi Breaks Glenn Maxwell’s Record: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బుధవారం అద్భుతమైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరిగిన మ్యాచ్‌లో అత్యంత వేగంగా 500 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన రెండవ ఓవర్ రెండవ బంతికి బౌండరీ బాదడం ద్వారా ఈ మైలురాయిని అందుకున్నాడు. కేవలం 222 బంతుల్లోనే 500 పరుగుల మార్కును చేరుకుని ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ రికార్డును బద్ధలు కొట్టాడు. గతంలో మాక్స్‌వెల్ 260 బంతుల్లో ఈ ఘనత సాధించగా, ఇప్పుడు 15 ఏళ్ల వయస్సులోనే వైభవ్ ఆ రికార్డును తిరగరాయడం విశేషం.

విఫలమైన వైభవ్..

ఈ రికార్డు సాధించినప్పటికీ, వైభవ్ ఈ మ్యాచ్‌లో ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి మోసిన్ ఖాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ ఆరంభంలో వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోయినా, గత రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలై కొంచెం ఒత్తిడిలో ఉంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. వరుసగా మూడు ఓటములతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో వెనుకబడింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సీజన్‌లో లక్నో ఇప్పటివరకు తమ హోమ్ గ్రౌండ్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. అలాగే రాజస్థాన్ జట్టుకు ఇతర స్టేడియాల్లో గెలుపు దక్కలేదు.

మరిన్ని ఆసక్తికరమైన స్పోర్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మయాంక్ ఎంట్రీ..

టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో దిగ్వేశ్ రాథీ, మయాంక్ యాదవ్ రాకతో ఎం. సిద్ధార్థ్, ఆవేష్ ఖాన్ బెంచ్‌కు పరిమితమయ్యారు. గత కొన్ని మ్యాచ్‌లు త‌మకు సవాలుగా మారాయని, కానీ త‌మకు సవాళ్లు అంటే ఇష్టమ‌ని పంత్ వ్యాఖ్యానించాడు. బోర్డుపై మంచి స్కోరు ఉంచి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలని అనుకుంటున్నామ‌ని, నికోలస్ పూరన్ మీద త‌మకు నమ్మకం ఉందని పంత్ తెలిపాడు. జట్టులో స్థిరత్వం కోసం బౌలింగ్ విభాగంలో రెండు మార్పులు చేసినట్లు వివరించాడు.

రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. గ‌త మ్యాచ్ ల‌లో ప‌రాజ‌యంపై విచారం వ్య‌క్తం చేశాడు.  గత మ్యాచ్ మధ్య ఓవర్లలో కొన్ని లెక్కలు తప్పినా, త‌మ బ్యాటింగ్ బాగానే ఉందని తెలిపాడు. ముఖ్యంగా జైస్వాల్, వైభవ్ ఆడుతున్న తీరు అద్భుతమ‌ని, వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ఈ వేగవంతమైన రికార్డు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. అతి చిన్న వయసులోనే దిగ్గజాల రికార్డులను సమం చేస్తుండటం ఇతని ప్రతిభకు నిదర్శనమ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇదే జోరు కొన‌సాగితే త్వ‌ర‌లోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడ‌ని ప‌లువురు జోస్యం చెబుతున్నారు. త్వ‌ర‌లో జ‌రిగే ఐర్లాండ్ టూర్ కు ప్ర‌యోగాత్మ‌కంగా వైభ‌వ్ ను ఆడించాల‌ని ఇప్ప‌టికే ప‌లు డిమాండ్లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ ఆ టూర్ లో అరంగేట్రం చేస్తే, అతి పిన్న వ‌యసులో డెబ్యూ చేసిన ప్లేయ‌ర్ గా మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొడ‌తాడు. 

మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి