IPL Auction 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) మినీ వేలం ఉత్కంఠభరితంగా జరగనుంది. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న ఈ మినీ, కానీ హై-ఇంటెన్సిటీ వేలం కోసం మొత్తం 1,355 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈసారి భారత్‌కు చెందిన చాలా మంది డొమెస్టిక్ ప్లేయర్లతో పాటు ప్రపంచంలోని టాప్ క్లాస్ అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
భారత ఆటగాళ్ల భారీ భాగస్వామ్యం
భారత క్రికెటర్ల జాబితాలో మయాంక్ అగర్వాల్, రవి బిష్ణోయ్, దీపక్ హుడా, కెఎస్ భరత్, వెంకటేష్ అయ్యర్, పృథ్వీ షా, శివం మావి, నవదీప్ సైనీ, చేతన్ సకారియా, రాహుల్ త్రిపాఠి వంటి ఆటగాళ్లు ఉన్నారు. కొత్త సీజన్‌లో తమకు మంచి అవకాశం లభిస్తుందని వారు భావిస్తున్నారు. BCCI త్వరలో ఆటగాళ్లందరి బేస్ ప్రైస్‌తో అధికారిక జాబితాను విడుదల చేస్తుంది.
అంతర్థాయ విదేశీ ఆటగాళ్లు సైతం
క్రికెట్‌బజ్ నివేదిక ప్రకారం, 13 పేజీల ఈ జాబితాలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు ఐపీఎల్ మినీ వేలంలోకి వచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. గత రెండు సీజన్ల నుంచి స్టీవ్ స్మిత్ అమ్ముడుపోవడం లేదు. నిలకడ లేమి, సత్తా చాటే ఇన్నింగ్స్ ఆడకపోవడం.. కీలక సందర్భాలలో జట్టుకు అందుబాటులో ఉండకపోవడం మైనస్ అవుతున్నాయి. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా టీ20 జట్టులో భాగం కావడానికి ఐపీఎల్‌లో రాణించాలని ఆశగా ఎదరుచూస్తున్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్ దారుణ ఆటతీరుతో విసిగిపోయి పంజాబ్ కింగ్స్ సైతం అతడ్ని రిలీజ్ చేసింది. అయితే తాను ఐపీఎల్ మినీ వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అయితే పెళ్లి కారణంగా అతడు సీజన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు. అయినప్పటికీ, జోష్ ఇంగ్లీష్ వేలంలో పేరు నమోదు చేయడం ద్వారా IPLకి తిరిగి రావాలనే ఆసక్తి ఉన్నట్లు హింట్ ఇచ్చాడు.
ఏ జట్టు వద్ద ఎక్కువ నగదు ఉంది
వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వద్ద ఎక్కువ నగదు ఉంది. ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్‌తో సహా పలువురు స్టార్ ప్లేయర్లను వేలంలోకి విడుదల చేయడంతో కేకేఆర్ వారి పర్సులో అత్యధిక మొత్తం మిగిలి ఉంది. రస్సెల్ ఐపీఎల్ క్రికెట్ నుండి రిటైర్ అయినా, ఈ సీజన్లో KKRలో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.
దీని తరువాత, రెండవ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఉంది. సీఎస్కే ఫ్రాంచైజీ రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్ వంటి ఆటగాళ్లను వేలంలోకి విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా శ్రీలంక పేసర్.. జూనియర్ మలింగాగా పిలచుకునే మతీషా పతిరణాను కూడా సీఎస్కే రిటైన్ చేసుకోకుండా వదిలివేసింది. దాంతో ఈ మినీ వేలంలో పతిరణ కోసం గట్టిగానే బిడ్ జరిగే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. పలువురు భారత స్టార్ ప్లేయర్లను సైతం జట్లు రీటైన్ చేసుకోలేదు. మహ్మద్ షమీ లాంటి స్టార్ పేసర్‌ను సన్‌రైజర్స్ జట్టు రిలీజ్ చేయడం తెలిసిందే.