Rohit Sharma IPL Records | చెన్నై: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 సీజన్‌ను దారుణంగా ప్రారంభించాడు. ఆదివారం రాత్రి చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులాడిన రోహిత్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో అత్యంత చెత్త రికార్డు హిట్ మ్యాన్ ఖాతాలో చేరింది. లీగ్ చరిత్రలో అత్యధిక పర్యాయాలు డకౌట్ అయిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. దినేష్ కార్తిక్, గ్లెన్ మాక్స్‌వెల్ రికార్డులను సమం చేశాడు.
మ్యాచ్ తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ తన వికెట్ సమర్పించుకున్నాడు. ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని లెగ్ సైడ్ వైపు ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించగా.. అది మిడ్-వికెట్‌లో ఉన్న శివమ్ దూబే వైపు వెళ్లింది. దూబే క్యాచ్ పట్టడంతో రోహిత్ డకౌట్ కాగా, ఐపీఎల్‌లో అతడికిది 18వ డకౌట్ కావడం గమనార్హం. గతంలో ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్, టీమిండియా మాజీ బ్యాటర్ దినేష్ కార్తీక్‌లతో కలిసి సంయుక్తంగా ఐపీఎల్‌లో అత్యధిక పర్యాయాలు డకౌట్ అయిన బ్యాటర్‌గా చెత్త రికార్డు రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్‌లు అయిన ఆటగాళ్లు వీరే
1) రోహిత్ శర్మ - 18
2) గ్లెన్ మాక్స్‌వెల్ - 18
3) దినేష్ కార్తీక్ - 18
4) పియూష్ చావ్లా - 16
5) సునీల్ నరైన్ - 16
అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ కేవలం 129 ఇన్నింగ్స్ లలో 18 సార్లు డకౌట్ కాగా, రోహిత్ శర్మ 253 ఇన్నింగ్స్ లలో, దినేష్ కార్తీక్ 257 ఇన్నింగ్స్‌లలో 18 పర్యాయాలు డకౌట్ అయ్యారు. అయితే ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ డకౌట్లు అయిన ఓపెనర్ గా సైతం రోహిత్ పేరిట చెత్త రికార్డు నమోదైంది. అత్యధిక డకౌట్లు కావడంతో రోహిత్ శర్మపై కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. అతడు ఛాంపియన్ అని, ట్రోలింగ్ చేయడం సరికాదని రోహిత్ శర్మ అభిమానులు హితవు పలుకుతున్నారు.
రోహిత్ శర్మ స్థానంలో విగ్నేష్ పుథూర్ సూపర్ సబ్ గా దిగి సత్తా చాటాడు. తన తొలి ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ (53) ను ఔట్ చేశాడు. తన రెండో ఓవర్లో శివం దూబే (9), మూడో ఓవర్లో దీపక్ హుడా (3) వికెట్లు తీశాడు.
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.