MI vs PBKS Match Prediction: IPL క్వాలిఫైయర్-2లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ (IPL 2025 Final) చేరుతుంది. జూన్ 3న టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో నేటి మ్యాచ్ విజేత తలపడనుంది. కానీ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ సైతం కొంచెం టెన్షన్ పడుతోంది. ఎందుకంటే అహ్మదాబాద్ స్టేడియం వారికి ఏమాత్రం కలిసిరాలేదు.

ముంబైకి కలిసిరాని అహ్మదాబాద్‌

ముంబై ఇండియన్స్, పంజాబ్ మధ్య ఆదివారం రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని MIకి ఈ స్టేడియంలో ట్రాక్ రికార్డ్ అంతా బాలేదు. ముంబై గత 3 సంవత్సరాలలో మోదీ స్టేడియంలో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ ముంబై గత 3 సంవత్సరాలలో ఈ మైదానంలో ఆడిన నాలుగు మ్యాచ్ లాడినా విజయం దక్కలేదు. ఈ నాలుగు మ్యాచ్‌లను గుజరాత్ టైటాన్స్‌తో ఆడింది. కానీ అన్ని మ్యాచ్‌లలో గుజరాత్ చేతిలో ముంబై ఓటమిని ఎదుర్కొంది.

పంజాబ్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది?

పంజాబ్ కింగ్స్‌కు ఈ స్టేడియం మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. పంజాబ్ జట్టు నరేంద్ర మోడీ స్టేడియంలో గత 5 మ్యాచ్‌లలో 3 గెలవగా, 2 మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కొంది. పంజాబ్ జట్టు ఛండీగఢ్‌లో RCBతో క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో ఓడింది. దాంతో ఎలిమినేటర్ మ్యాచ్ విజేత అయిన ముంబైతో తలపడుతోంది. నేటి మ్యాచ్‌లో ఓడిన జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు టైటిల్ పోరులో ఆర్సీబీని ఢీకొట్టనుంది. జూన్ 3న ఇదే వేదికగా ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్

IPL 2025 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరుగుతుంది. ముందుగా నేటి రాత్రి పంజాబ్, ముంబై మధ్య క్వాలిఫయర్ 2 జరుగుతుంది. విజేతగా నిలిచిన జట్టు జూన్ 3న జరగనున్న ఫైనల్లో ఆర్సీబీతో తలపడుతుంది. వాస్తవానికి తొలతు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సి ఉంది. కానీ భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ వారం రోజులపాటు నిలిపివేశారు. తరువాత రీషెడ్యూల్ చేసిన సమయంలో కొన్ని వేదికలను మార్చేశారు. ఈ క్రమంలో ఐపీఎల్ ఫైనల్ ను భారీ భద్రత నడుమ అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఫైనల్ మ్యాచ్‌ వేదికను కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు మార్చారు.