Hardik Pandya: పాండ్యా నువ్వు ఇక మారవా..! ఆ కామెంట్లకు అర్థమేంటీ ? ముంబై కెప్టెన్‌కు జరిమానా
Hardik Pandya fined for slow over-rate MI vs Gujarat Titans | ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. గుజరాత్ తో మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు కారణంగా ముంబై కెప్టెన్ కు జరిమానా విధించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. తమ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ తేలిపోయిందన్నాడు. బ్యాటింగ్ లో 15-20 పరుగులు ఎక్కువ చేయాలని, బౌలింగ్ లోనూ 20 రన్స్ వరకు కట్టడి చేయాల్సి ఉందన్నాడు. అహ్మదాబాద్ లాంటి పిచ్ లపై స్లో డెలివరీలను ఎదుర్కోవడం కష్టమని అభిప్రాయపడ్డాడు.
గత సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ నిషేధం వల్ల తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆడలేదు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం ఆడిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముంబై బౌలర్లు డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణించడంతో గుజరాత్ ను 200 పరుగుల లోపు కట్టడి చేశారు. 196 పరుగుల వద్ద జీటీ ఇన్నింగ్స్ ముగించినా.. ముంబై ఆ స్కోరును ఛేదించలేక ఓటమిపాలైంది. వరుస 2 మ్యాచ్ లలో ఓడిన ముంబై పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.
గుజరాత్ చేతిలో ఓటమి అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. మేం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విఫలమయ్యాం. బ్యాటింగ్ లో మరో 15-20 పరుగులు తక్కువగా చేస్తున్నాం. బౌలింగ్ లోనూ 20 పరుగుల వరకు కట్టడి చేయాల్సి ఉంది. మేం చాలా తప్పిదాలు చేశాం. దాంతో 20-25 పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నాం. T20 ఆటలో ఆ రన్స్ చాలా ఎక్కువ.
గుజరాత్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారు ఎక్కువ అవకాశాలు తీసుకోలేదు. ఎలాంటి రిస్క్ షాట్లు ఆడకుండానే పరుగులు సాధించారు. ముంబై ఓపెనర్లు సైతం రాణిస్తే జట్టుకు ప్రయోజనకరం. గుజరాత్ ఓపెనర్లలా బాధ్యతగా ఆడితే ప్రయోజనం ఉంటుంది. ఇది కేవలం ప్రారంభ దశనే.. త్వరలో పూర్తి స్థాయిలో ప్రదర్శన చేయాలి. స్లో డెలివరీలు మమ్మల్ని ఇబ్బందిపెట్టాయి. వాటికే మా బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. గుజరాత్ టీమ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాణించడంతో విజయం సాధించారు. రోహిత్ శర్మను ఉద్దేశించి ఓపెనర్లు రాణించాలని, బాధ్యత తీసుకోవాలని హార్దిక్ పాండ్యా మాట్లాడాడని వైరల్ అవుతోంది. కేవలం ఒక్కరి వల్లే మ్యాచ్ ఓడటం జరగదని కెప్టెన్ పాండ్యా గుర్తించాలని ముంబై ఫ్యాన్స్, రోహిత్ ఫ్యాన్స్, నెటిజన్లు సలహా ఇస్తున్నారు.
గత సీజన్లో స్లో ఓవర్ రేటు కారణంగా తొలి మ్యాచ్ కు దూరమైన పాండ్యా.. గుజరాత్ తో మ్యాచ్ లోనూ అదే తప్పిదం చేశాడు. ముంబై స్లో ఓవర్ రేటు కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా విధించారు. వేగంగా ఫీల్డ్ సెటప్ చేయలేకపోవడం, బౌలర్లను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం, టీమ్ సెలక్షన్ లోనూ లోపాలు ఉన్నాయని హార్దిక్ పై విమర్శలు వస్తున్నాయి.