IPL 2025 SRH News | ఐపీఎల్ లో 300 స్కోర్ దాటే సత్తా ఉన్న టీమ్, కాటేరమ్మ కొడుకులు  అంటూ ఇస్తున్న హైప్ SRH ఆటతీరుపై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది అంటున్నారు  స్పోర్ట్స్ ఎనలిస్ట్ లు. భీకర బ్యాటింగ్ లైనప్ తో టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా బరి లోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైంది.  ఆటల్లో గెలవడం ఓడిపోవడం సహజమే అయినా SRH గేమ్ ప్లాన్ సరిగ్గా లేకపోవడమే అసలు సమస్య అంటున్నారు SRH ఫ్యాన్స్.

ఇన్నింగ్స్ నిలబెట్టడంపై లేని శ్రద్ద 

 ఐపీఎల్ అనేది ధనాధన్ ఆటకు  పెట్టింది పేరు. సిక్స్ లు ఫోర్ లతో బ్యాటర్లు విరుచుకుపడుతుంటే చూసే ఆనందిస్తారు ఫ్యాన్స్. అలాంటి బ్యాట్స్ మెన్ కే మద్దతుదారులు ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ అజింక్యా రహనే, రచిన్ రవీంద్ర, KL రాహుల్ లాంటి వాళ్లకు ఎందుకు పెద్దపీట వేస్తున్నారంటే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లు ఒక గోడలా నిలబడతారు. వికెట్లు పతనమవుతున్న తరుణంలో  ఇన్నింగ్స్ ను మళ్లీ నిర్మిస్తారు. నిజానికి ఆడాల్సిన పద్ధతి ఇదే. టెస్ట్ అయినా వన్డే అయినా టి20 అయినా  ఈ రకమైన ఆట తీరు చాలా ముఖ్యం. ప్రపంచ క్రికెట్లో రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్, కలిస్, శివ నారాయణ చంద్రపాల్ లాంటి వాళ్ళు లెజెండ్స్ గా మిగిలిపోయారంటే ఈ రకమైన ఆట తీరు వల్లే. SRH యాజమాన్యం గానీ, ఆటగాళ్లు గానీ ఈ సీజన్లో అసలు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టు కనిపించట్లేదు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు సిక్సుల కోసం అనవసర షాట్ ల కోసం ప్రయత్నిస్తూ వరుసగా ఔటయిపోతున్నారు. కనీసం వికెట్లు పడిపోతున్న తరుణంలోనూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం ఎవరూ చేయట్లేదు.

ఎప్పుడెప్పుడు 300 కొట్టేద్దామా అని చూస్తున్నారు తప్ప మ్యాచ్ స్వభావం ఏంటి అన్నది వాళ్లు దృష్టిలో పెట్టుకోవట్లేదని సగటు ఎస్ ఆర్ హెచ్ అభిమాని వాపోతున్నాడు. ఈ హడావుడి ఆటతీరుతో  తమ బ్యాటింగ్ లైనప్ లోని లోపాలను ప్రత్యర్థి జట్లకు తెలిసిపోయేలా చేస్తున్నారని స్పోర్ట్స్ ఎనలిస్ట్ లు విశ్లేషణ చేస్తున్నారు. వరుసగా LSG, DC చేతుల్లో ఓటమి పాలవడమే కాకుండా కనీసం 200 స్కోర్ కూడా దాటలేకపోవడం, DC మ్యాచ్ లో అయితే 20 ఓవర్ల బ్యాటింగ్ కూడా పూర్తి చేయలేకపోవడం ఖచ్చితంగా SRH బ్యాటింగ్ లైనప్ లోని డొల్లతనాన్ని  బయట పెట్టేస్తుంది అంటున్నారు వాళ్ళు. ట్రావెస్ హెడ్ బౌన్సర్లకు దొరికిపోవడం, అద్భుతంగాడుతున్న అనికేతవర్మకు సపోర్ట్ ఇవ్వకుండా కెప్టెన్ పాట్ కమిన్స్ లేని షాట్ కి వెళ్లి ఔట్ అవడం, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్లు పరిస్థితులు అర్థం చేసుకోకుండా సిక్సర్ లకు వెళ్లి అవుట్ అవ్వడం ఇవన్నీ టీం ఫైనల్ టోటల్ పై పెద్ద ప్రభావం చూపించాయి. ఐపీఎల్ 2025 లో  SRH ఆడిన తొలి మ్యాచ్ చూసి అసలు ఈ టీం ని  అడ్డుకునే ప్రత్యర్థులు ఉంటారా అని ఆనందపడ్డ SRH అభిమానులు ఇప్పుడు వరుసగా ఎదురైన రెండు ఓటములరో ఇదేం ఆట తీరు అంటూ పెదవిరుస్తున్నారు. 

 ప్లస్లులూ లేకపోలేదు : విమర్శల మాట ఎలా ఉన్నా ఢిల్లీ తో మ్యాచ్ పుణ్యమా అంటూ  అనికేత్ వర్మ లాంటి మరొక టాలెంటెడ్ ప్లేయర్ వెలుగులోకి రావడం SRH కు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఒత్తిడిని అతను  ఎదుర్కొన్న తీరు, సిక్సర్లు కొట్టడంలో  పర్ఫెక్షన్  అతన్ని ఒక క్వాలిటీ ప్లేయర్ గా గుర్తించేలా చేశాయి. ప్రస్తుతం SRH కు కావలసిందల్లా అలాంటి ఇన్నింగ్స్ నిర్మించే ఓపిక గల యాటిట్యూడే అంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ మ్యాచ్లో వెలుగులోకి వచ్చిన మరొక బౌలర్ జీషన్ అన్సారీ. నాలుగు ఓవర్లు వేసిన ఈ యంగ్ బౌలర్ మూడు వికెట్లు తీసుకుని తన ప్రతిభ చాటాడు. కానీ IPL లాంటి టోర్నమెంట్ లలో వీటన్నిటి కన్నా  గెలుపే ప్రధానం. అందుకే ఫ్యాన్సీ క్రికెట్ కన్నా మ్యాచ్ విన్నింగ్ అట తీరు పై SRH దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు హైదరాబాదీ ఫ్యాన్స్.