IPL 2025 DC vs SRH | విశాఖపట్నం: ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ పటిష్టంగా కనిపిస్తోంది. సన్ రైజర్స్ మాత్రం ఎక్కువగా బ్యాటింగ్ బలంపై ఆధారపడుతోంది. ఒకవేళ బ్యాటర్లు విఫలమైనా, అంచనాల మేర రాణించకపోయినా ఫలితాలు నిరాశ పరుస్తున్నాయి. నేడు విశాఖపట్నం వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ తలపడనున్నాయి. పటిష్ట బౌలింగ్ అటాక్ ఉన్న ఢిల్లీని ఎదుర్కొని సన్‌రైజర్స్ ను గెలిపించడం పాట్ కమిన్స్ కు సవాల్ లాంటిదే.

ముఖాముఖీ పోరు వివరాలు చూస్తే ఢిల్లీపై సన్‌రైజర్స్ దే ఆధిక్యం. ఈ రెండు జట్లు ఐపీఎల్ లో 24 సార్లు తలపడగా, సన్‌రైజర్స్ 13 మ్యాచ్‌లలో నెగ్గగా, ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఢిల్లీపై సన్‌రైజర్స్ హయ్యెస్ట్ స్కోరు 266 పరుగులు, కాగా సన్‌రైజర్స్ మీద ఢిల్లీ హయ్యెస్ట్ స్కోరు 207. ఈ జట్ల పోరులో అత్యల్ప స్కోరు ఢిల్లీ పేరిటే ఉంది. ఢిల్లీ 80 రన్స్ చేసింది, సన్ రైజర్స్ అత్యల్పంగా 116 పరుగులు చేసింది. 

గత ఐదు సీజన్లు గమనిస్తే..2019లో మూడు సార్లు ఢిల్లీ, సన్ రైజర్స్ తలపడగా ఢిల్లీ రెండు మ్యాచ్‌లు నెగ్గగా, ఒక్క మ్యాచ్‌లో SRH విజయం సాధించింది.2020లో మూడు సార్లు ఢిల్లీ, సన్ రైజర్స్ తలపడగా రెండు మ్యాచ్‌లలో హైదరాబాద్ గెలుపొందగా, ఢిల్లీ ఒక్క మ్యాచ్ నెగ్గింది. 2021లో ఢిల్లీ రెండు మ్యాచ్‌లలో నెగ్గింది. 2022లోనూ ఢిల్లీ ఒక్క మ్యాచ్‌లో సన్ రైజర్స్‌పై విజయం సాధించింది. 2023లో ఢిల్లీ, సన్ రైజర్స్ ఒక్కో మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్నాయి. 2024లో సన్ రైజర్స్ 67 పరుగుల తేడాతో ఢిల్లీని బోల్తా కొట్టింది. 

పిచ్ కండీషన్..విశాఖపట్నం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. మరోవైపు మధ్యాహ్నం మ్యాచ్ మొదలవుతుంది కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 200 కంటే ఎక్కువ స్కోరు సాధించాలని భావిస్తుంది. గత మూడు మ్యాచ్‌లలో మొదటి ఇన్నింగ్స్ స్కోర్లు 191, 272, 209గా ఉన్నాయి. సాధ్యమైనన్ని పరుగులు చేసి సెకండ్ బ్యాటింగ్ చేసే టీంపై ఒత్తిడి పెంచాలని టాస్ గెలిచిన కెప్టెన్ భావించే అవకాశం ఉంది. విశాఖ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం. నేడు ఢిల్లీ, సన్ రైజర్స్ మ్యాచ్ లో సైతం భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. గత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ మీద కోల్‌కతా జట్టు చేసిన 272 పరుగులే విశాఖలో అత్యధిక స్కోరు.

తొలి మ్యాచ్లో అందుబాటులో లేని కేఎల్ రాహుల్ నేడు సన్ రైజర్స్ తో జరగనున్న మ్యాచ్ కు అందుబాటులోకి రానున్నాడు. రాహుల్ రాకతో ఢిల్లీ బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది. లక్నోతో మ్యాచ్లో పవర్ ప్లే లో వికెట్లు కోల్పోవడం సన్ రైజర్స్ ను దెబ్బతీసింది. నేడు ఢిల్లీతో మ్యాచ్ సన్ రైజర్స్ కు అగ్నిపరీక్ష లాంటిదే. మిచెల్ స్టార్క్ ఆధ్వర్యంలోని ఢిల్లీ బౌలింగ్ అటాక్ ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. గత ఏడాది ఫైనల్ లో కేకేఆర్ తరఫున ఆడిన మిచెల్ స్టార్క్.. SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను అవుట్ చేశాడు. సన్ రైజర్స్ ఓపెనర్లు వర్సెస్ విచల్ స్టార్కుగా పరిస్థితి మారనుంది. స్టార్కును ఎదుర్కో లేకపోతే ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ రాణించడం కష్టమే.