RCB IPL 2024 Playoff Qualification Scenario: ఈ ఐపీఎల్‌(IPL)లో బెంగళూరు(RCB) పరాజయాల పరంపర కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ (SRH)సునామీల విరుచుకుపడడంతో.. బెంగళూరు మరోసారి పరాజయం పాలైంది. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఒకే మ్యాచులో గెలిచి... ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్‌పై మాత్రమే బెంగళూరు గెలిచింది. బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగలదా? ప్లేఆఫ్‌కు చేరాలన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆశలు సజీవంగా ఉన్నాయా? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఏం జరగాలి... ఇలాంటి ప్రశ్నలు చాలామంది నుంచి ఉత్పన్నమవుతున్నాయి. బెంగళూరు అభిమానులు కూడా ప్లే ఆఫ్‌కు చేరేందుకు ఉన్న అవకాశాలపై లెక్కలు వేస్తున్నారు. 


కష్టమే...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే చాలా కష్టం. తొలి 7 మ్యాచ్‌ల్లో బెంగళూరు కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించింది. బెంగళూరుకు ఇంకా 7 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి, ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడబోయే 7 మ్యాచ్‌లన్నింటినీ గెలిస్తే అప్పుడు ఆ జట్టు 16 పాయింట్లతో ఉంటుంది. ఈ 16 పాయింట్లు ప్లే ఆఫ్‌కు చేరేందుకు బెంగళూరుకు సరిపోవు. ఒకవేళ అన్ని మ్యాచుల్లో గెలిచినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్లే ఆఫ్‌కు చేరాలన్నా అది బెంగళూరు చేతుల్లో లేదు. ఈ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... పంజాబ్ కింగ్స్‌పై గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాబోయే మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది. మార్చి 21న ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. 


హైదరాబాద్‌ ఊచకోత
 చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సునామీల విరుచుకుపడి బెంగళూరు జట్టును ముంచేసింది.  చిన్నస్వామి స్టేడియం బౌండరీలతో దద్దరిల్లింది. సిక్సులతో తడిసి ముద్దయింది. హైదరాబాద్‌ బ్యాటర్ల విధ్వంసంతో  మార్మోగిపోయింది. సిక్సర్లు కొట్టడం ఇంత తేలికా అనేలా.. బౌండరీలే  సింగల్‌ రన్స్‌గా మారిన వేళ హైదరాబాద్ సృష్టించిన సునామీలో... బెంగళూరు బౌలర్లు గల్లంతయ్యారు. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటికే అత్యధిక స్కోరు నమోదు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... ఇప్పుడు ఆ రికార్డును కాల గర్భంలో కలిపేసింది. మరోసారి ఉప్పెనలా మారి బెంగళూరుపై విరుచుకపడింది. హైదరాబాద్‌ బ్యాటర్ల విధ్వంసంతో తొలుత హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి  287 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 262 పరుగులకే పరిమితం కావడంతో హైదరాబాద్‌ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లీ, డుప్లెసిస్‌, దినేశ్ కార్తిక్‌ రాణించినా.. ఆ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది.