IPL 2024 RR vs GT Preview And Prediction : ఐపీఎల్ 2024 (IPL)సీజన్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (RR)మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న రాజస్థాన్... పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న గుజరాత్(GT)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటివరకూ అయిదు మ్యాచులు ఆడిన గుజరాత్... రెండు విజయాలు.. మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ దిశగా మరో అడుగు ముందుకు వేయాలని గుజరాత్ వ్యూహాలు రచిస్తోంది.
యశస్వీ ఫామ్‌లోకి వస్తే..
వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్‌ను.. స్టార్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వరుస వైఫల్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. టీమిండియా తరపును అద్భుత ఆటతీరుతో అలరించిన జైస్వాల్.. ఐపీఎల్‌లో మాత్రం విఫలమవుతున్నాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లో జైస్వాల్ కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. జైస్వాల్ ఓపెనింగ్ జోడీ జోస్ బట్లర్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అజేయ సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఇక యశస్వీ కూడా ఫామ్‌లోకి వస్తే రాజస్థాన్‌కు తిరుగుండదు. రాజస్థాన్ సారధి సంజూ శాంసన్ నాలుగు మ్యాచుల్లో రెండు అర్ధసెంచరీలతో 178 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. రియాన్ పరాగ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. పరాగ్ ఇప్పటివరకు 185 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. హెట్‌మెయర్ ధ్రువ్ జురెల్‌తో రాజస్థాన్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. పేసర్లు ట్రెంట్ బౌల్ట్, నాంద్రే బర్గర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌లతో రాజస్థాన్ బౌలింగ్ దళం కూడా చాలా బలంగా ఉంది. అయితే రవిచంద్రన్ అశ్విన్ ఇంకా ఫామ్‌లోకి రాకపోవడం రాజస్థాన్‌ను ఆందోళన పరుస్తోంది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్... ఓవర్‌కు ఎనిమిది పరుగులిచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు.
గుజరాత్ తీరు మారేనా..?
ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అయిదు మ్యాచులు ఆడిన గుజరాత్... రెండు విజయాలు.. మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టు... వరుస పరాజయాల నుంచి బయటపడాలని చూస్తోంది. గిల్ ఫామ్‌లోనే ఉన్నా అతనికి వేరే బ్యాటర్ల నుంచి మద్దతు కరువవుతోంది. గిల్ ఐదు మ్యుచుల్లో 147 స్ట్రైక్ రేట్‌తో 183 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ కూడా పరుగులు చేస్తూనే ఉన్నాడు. అనుభవజ్ఞులు మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్ బంతితో మరింత రాణించాల్సిన అవసరం ఉంది. ఆఫ్ఘన్ త్రయం అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది.
జట్లు
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, కేశవ్ మహరాజ్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, రాబిన్ మింజ్, కేన్ విలియమ్సన్, అభినవ్ మంధర్, బి సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుఖ్ ఖాన్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాతియా, కార్తీ త్యాగి, శాంత్ మిశ్రా, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ మరియు మానవ్ సుతార్.