IPL 2024 Rishabh Pant is back but out for less runs : రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న తర్వాత తొలి మ్యాచ్‌ ఆడుతున్న రిషభ్‌ పంత్‌( Rishabh Pant) తొలి మ్యాచ్‌లో తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఆరంభంలో క్రీజులోకి స్వేచ్ఛగా కదులిన పంత్‌ ఓ ఫోర్‌ కొట్టి మంచి టచ్‌లో కనిపించాడు. ఆడిన తొలి మూడు బంతుల్లో రెండు సింగిల్స్‌ తీసి భారీ స్కోరు చేస్తాడని ఆశలు రేపాడు. రాహుల్ చాహర్‌ వేసిన 12 ఓవర్‌లో రెండో బంతిని బౌండరీకి పంపి ఈ ఐపీఎల్‌లో రిషభ్ పంత్‌ మొదటి బౌండరీ సాధించాడు. ఆ తర్వాత మరో బౌండరీ బాది ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. మొత్తం 13 బంతులు ఎదుర్కొన్న పంత్‌ 2 ఫోర్లతో 18 పరుగులు చేసి అవుటయ్యాడు. హర్షల్‌  పటేల్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టోకు సులువైన క్యాచ్‌ ఇచ్చి పంత్‌ అవుటయ్యాడు.


పంత్‌ ప్రయాణం, ఓ అద్భుతం


భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishabh Pant) గత ఏడాది డిసెంబర్‌లో రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ యాక్సిడెంట్‌లో అతని కాలులోని లిగమెంట్‌ చిరిగిపోయింది. దీంతో పాటు చేయి, కాలు, వీపుకు కూడా గాయాలయ్యాయి. అతని ప్రాథమిక చికిత్స మొదట డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో జరిగింది. కొత్త ఏడాది రోజున ఇంట్లో వారికి సర్‌ప్రైజ్‌ ఇద్దామని ఢిల్లీ నుంచి ఒంటరిగా పంత్‌ బయల్దేరగా.. ఢిల్లీ-రూర్కీ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత ఏడాదిగా క్రికెట్‌కు దూరమైన పంత్‌ మళ్లీ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆడేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలో పంత్‌కై చికిత్స చేసిన వైద్యులు సంచలన విషయాలు వెల్లడించారు. పంత్‌ ఓ అద్భుతమని... అతడు కోలుకుని క్రికెట్‌ ఆడడం ఓ అద్భుతమని చెప్పి పంత్‌ అంకితభావాన్ని మెచ్చుకున్నాడు.


పంత్‌ ఆస్పత్రిలో చేరాక కుడి మోకాలికి ఏకంగా మూడు ఆపరేషన్లు చేశారని పాదం, మణికట్టు ఎముకలు విరిగాయని దిన్షా పార్దీవాలా గుర్తు చేసుకున్నారు. నువ్వు క్రికెట్‌ ఆడేందుకు కనీసం 18 నెలలు పడుతుందని తాను పంత్‌తో చెప్పానని... కానీ తాను 12 నెలల్లో తిరిగి మైదానంలో అడుగు పెడతానని అన్నాడని.... డాక్టర్‌ తెలిపాడు. తీవ్రంగా శ్రమించిన పంత్‌ తాను అనుకున్న దానికంటే మూడు నెలల ముందే టీ 20 క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడని దిన్షా పార్దీవాలా వెల్లడించారు. రిషబ్‌ కోలుకొని సాధారణ వ్యక్తిలా చేస్తామని తాము అతడి తల్లికి హామీ ఇచ్చామని... దాన్ని విజయవంతంగా నిలబెట్టుకున్నామని డాక్టర్‌ దిన్షా చెప్పారు.  మోకాలి చిప్ప పక్కకు జరగడం అనేదీ తీవ్రమైన గాయమని.. పంత్‌కు మోకాలి దగ్గర ఉన్న ప్రతీ భాగం తీవ్రంగా దెబ్బతిందని కూడా డాక్టర్ వెల్లడించారు. వాటిని సాధారణ స్థితికి తీసుకొచ్చి స్థిరత్వాన్ని కల్పించడం ప్రతీ సర్జన్‌కూ సవాలేనని అన్నాడు. ఆ సమయంలో పంత్‌కు తాము అండగా నిలిచామని వివరించారు. 14 నెలల తర్వాత రిషబ్‌ ఎట్టకేలకు ఫిట్‌నెస్‌ సాధించి.. ఐపీఎల్‌(ipl)తో పునరాగమనం చేయడం ఆనందంగా ఉందని కూడా డాక్టర్‌ తెలిపారు. రోడ్డు ప్రమాదం తర్వాత రిషబ్‌ పంత్‌ మళ్లీ క్రికెట్‌ ఆడటం దాదాపు అసాధ్యమని భావించామని కానీ పంత్‌ మాత్రం తన సంకల్ప బలంతో కోలుకుని త్వరలోనే పునరాగమనం చేశాడన్నారు.