IPL 2024 RCB vs KKR Match Preview: ఐపీఎల్(IPL)లో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. బెంగళూరు(RCB)తో కోల్‌కత్తా నైట్ రైడర్స్(KKR) అమీతుమీ తేల్చుకోనుంది. ముంబై-హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు నమోదు కావడంతో ఐపీఎల్ ఫీవర్ మరికాస్త పెరిగింది. ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదు కావాలని.. విరాట్ విశ్వరూపం చూడాలని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వేదికగా ఆర్సీబీ- కేకేఆర్ మ్యాచ్ జరగనుంది. బెంగళూరుకు ఇది మూడో మ్యాచ్‌కాగా... కోల్‌కత్తాకు ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా... సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి మంచి ఫామ్‌లో ఉండగా... తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడినా... రెండో మ్యాచ్‌లో పంజాబ్స్‌పై గెలిచి బెంగళూరు కూడా జోరు మీద ఉంది.
కోహ్లీపైనే భారమంతా..?
ఈ మ్యాచ్‌లో కోహ్లీపైనే అందరి కళ్లు కేంద్రీకృతమై ఉంది. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై విరాట్... విక్టరీ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ 49 బంతుల్లో 77 పరుగులు చేసి ఆర్సీబీని గెలిపించాడు. సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండడం బెంగళూరుకు కలిసిరానుంది. విరాట్ కోహ్లీతో పాటు దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్ రూపంలో పవర్ హిట్టింగ్‌లతో బెంగళూరు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. కార్తీక్, లోమ్రోర్‌ల జోడీ గత మ్యాచ్‌లోనూ రాణించడం బెంగళూరుకు కలిసి రానుంది. మహ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్‌లతో కూడిన బెంగళూరు బౌలింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. పేస్‌లో బెంగళూరు కాస్త బలంగా కనిపిస్తున్నా స్పిన్ విభాగంలో మాత్రం బలహీనంగా కనిపిస్తోంది. మాక్స్‌వెల్ బౌలింగ్‌లో రాణిస్తున్నా.... బ్యాటింగ్‌లో విఫలం కావడం బెంగళూరు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తమ విజయాల పరంపరను కొనసాగించేందుకు ఆర్సీబీ ఎదురుచూస్తోంది.
కోల్‌కత్తా జోరు సాగేనా..?
విధ్వంసకర బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్‌తో బలంగా ఉంది. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ ఓపెనర్ల జోడి మారే అవకాశం ఉంది. కోల్‌కత్తాను ఓపెనింగ్ సమస్య ఇంకా వెంటాడుతూనే ఉంది. ఓపెనింగ్ స్థానంపై కోల్‌కత్తా ప్రయోగాలు చేస్తూనే ఉంది. రింకూ సింగ్ కోల్‌కత్తాకు మంచి ఫినిషర్ దొరికాడు. బౌలింగ్ విషయానికి వస్తే, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తితో కోల్‌కత్తా స్పిన్ విభాగం బలంగా ఉంది. బ్యాటర్లు, బౌలర్లతో పటిష్టంగా ఉన్న కోల్‌కత్తాతో బెంగళూరుకు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
జట్లు:
బెంగళూరు జట్టు( అంచనా): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఆకాష్ దీప్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, స్వప్నిల్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, విల్ జాక్స్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్.
కోల్‌కత్తా జట్టు( అంచనా): శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రస్సెల్, ఫిల్ సాల్ట్, వెంకీ అయ్యర్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, ఆరోన్ వరుణ్, హర్షిత్ రాణా, నితేష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్.