How can RCB qualify despite registering their 7th loss : ఈ ఐపీఎల్‌(IPL)లో బెంగళూరు(RCB) పరాజయాల పరంపర కొనసాగుతోంది. కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో  బెంగళూరు మరోసారి పరాజయం పాలైంది. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచులు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఒకే మ్యాచులో గెలిచి... ఏడు మ్యాచుల్లో ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్‌పై మాత్రమే బెంగళూరు గెలిచింది. బెంగళూరు 8 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగలదా? ప్లేఆఫ్‌కు చేరాలన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆశలు సజీవంగా ఉన్నాయా? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఏం జరగాలి... ఇలాంటి ప్రశ్నలు చాలామంది నుంచి ఉత్పన్నమవుతున్నాయి. బెంగళూరు అభిమానులు కూడా ప్లే ఆఫ్‌కు చేరేందుకు ఉన్న అవకాశాలపై లెక్కలు వేస్తున్నారు. ఈ ఐపీఎల్ లో ఆర్సీబీ క్వాలిఫైయర్స్ కి వెళ్లాలంటే ఒకే ఒక్క దారి ఉంది. 


ఈ దారి ఒక్కటే...
ఇప్పటివరకూ ఐపీఎల్‌ చరిత్ర చూసుకుంటే కనీసం 8 మ్యాచులు గెలిచిన జట్లు క్వాలిఫైయర్స్ కి అర్హత సాధించాయి. 8 మ్యాచ్ లు గెలిస్తే 16 పాయింట్లు ఉంటాయి. అప్పుడప్పుడూ  7 మ్యాచ్ లు గెలిచిన జట్లు కూడా 14పాయింట్లతో క్వాలిఫైయర్స్ కి వెళ్లాయి. ఈ ఐపీఎల్‌లో బెంగళూరు ఇప్పటికే ఎనిమిది మ్యాచులు ఆడేసింది. ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒకవేళ బెంగళూరుకు మిణుకుమిణుకుమంటున్న ఆశలైనా సజీవంగా ఉండాలంటే మిగిలి ఉన్న ఈ ఆరుకు ఆరు మ్యాచులను  గెలవాలి. అప్పుడు వారికి లభించి 12పాయింట్లు... ఇప్పటికే ఉన్న రెండు పాయింట్లు కలిపి 14పాయింట్లు అవుతాయి. ఇదే టైమ్ లో ఇప్పుడు టాప్ 4లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లు ఓడిపోవాలి. అది కూడా పంజాబ్, ఢిల్లీ, ముంబై , లక్నో చేతుల్లో అవి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి. అప్పుడు 14 పాయింట్లతో క్వాలిఫైయర్స్ కి వెళ్లేందుకు కనీసం ఒక్క టీమ్ కైనా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఛాన్స్ లో నిలబడే అర్హత బెంగుళూరు సాధించాలి. ఇప్పుడు బెంగుళూరు రన్ రేట్ -1.046 ఉంది కాబట్టి..ఆర్సీబీ గెలవబోయే 6 మ్యాచుల్లోనూ బీభత్సమైన రన్ రేట్ సంపాదించుకోవాలి. అప్పుడు 14పాయింట్లతో క్వాలిఫైయర్స్ కి వెళ్లే ఒక్క జట్టుగా ఆర్సీబీ నిలిస్తే చాలు..ఈ సాలా కప్ నమ్మదే. 


కోల్‌కత్తా మ్యాచ్‌లో...
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు(RCB)పై కోల్‌కతా(KKR) విజయం సాధించింది. ఆఖరు వరకు జరిగిన మ్యాచ్‌లోకోల్‌క తా చివరి బంతికి గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా... నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 50 హాఫ్ సెంచరీ సాధించాడు. ఓపెనర్‌ ఫిలిప్ సాల్ట్ 48, ఆండ్రి రస్సెల్ 27, రమణ్‌ ధీప్‌ 24 పరుగులతో రాణించారు. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్ , కామెరూన్ గ్రీన్ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్‌, ఫెర్గూసన్ చెరో వికెట్‌ తీశారు. అనంతరం భారీ లక్ష్యచేధనలో బెంగళూరు చివరి వరకూ పోరాడినా ఓటమి చవిచూసింది. విల్‌ జాక్స్‌, రజత్‌ పటిదార్‌ అర్థసెంచరీలతో మెరిశారు. చివర్లో దినే‌శ్‌ కార్తీక్‌, కరణ్‌ శర్మ పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రి రస్సెల్ 3, హర్షిత్‌ రాణా, సునీల్ నరైన్‌ చెరో రెండు వికెట్లు తీశారు.