IPL 2024 Playoffs Qualification Scenario : నెల రోజుల క్రితం చెన్నైలో మొదలైన ఐపీఎల్ సీజన్ 2024(IPL 2024)లో సగం మ్యాచులు పూర్తయ్యాయి. అద్భుత శతకాలు.. బౌలర్ల సంచలనాలు... ఫిల్డర్ల విన్యాసాలతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఇప్పుడు ఐపీఎల్‌లో అసలు కథ ప్రారంభం కానుంది. ప్లే ఆఫ్ కోసం అసలు యుద్ధం ప్రారంభం కానుంది. దీని కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి. మొత్తం 74 మ్యాచ్‌ల ఈ ఐపీఎల్ లీగ్‌లో సగం సీజన్ పూర్తయింది. అప్పుడే లీగ్‌లో 38 మ్యాచ్‌లు పూర్తయిపోయాయి. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సీజన్‌లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. వన్డేల్లో మాదిరిగా 270, 280 స్కోర్లు చేస్తూ ‘మిషన్ 300’ను పూర్తిచేసే దిశగా ఐపీఎల్ సాగుతోంది. ఈ మిషన్‌ను పూర్తి చేసే బాధ్యతను సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు అత్యధిక స్కోరు రికార్డును తిరగరాసిన సన్‌రైజర్స్...300 పరుగులే తమ మిషన్‌గా ముందుకు సాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే 8.99 రన్‌రేట్‌తో ‘ఐపీఎల్‌లో మోస్ట్ హైస్కోరింగ్ సీజన్’గా 2024 రికార్డులకెక్కింది.
ఏ జట్టు ఎక్కడంటే..?
ఐపీఎల్ 2024లో సగం మ్యాచులు పూర్తయిన తర్వాత కేవలం ఒకే ఒక్క ఓటమితో రాజస్థాన్ టేబుల్ టాప్ పొజిషన్‌లో ఉంది. కేవలం ఒకే ఒక్క గెలుపుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లతో టాప్ పొజిషన్‌లో ఉంది. రాజస్థాన్ 8 మ్యాచ్‌లలో ఏకంగా 7 విజయాలు అందుకుంది. తర్వాత 10 పాయింట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో స్థానంలో ఉంది. కోల్‌కత్తా 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు అందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 10 పాయింట్లు సాధించినా, నెట్ రన్‌రేటు తక్కువగా ఉండటంతో మూడో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ కూడా 7 మ్యాచ్‌ల్లో అయిదు మ్యాచుల్లో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చెన్నై 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు అందుకుంది. లక్నో కూడా చెన్నైతో సమానమే అయినా నెట్ రన్ రేటుతో అయిదో స్థానానికి పరిమితం అయింది. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం రాజస్థాన్, కోల్‌కతా, సన్‌రైజర్స్, చెన్నై, లక్నో మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటే గుజరాత్, ముంబై, ఢిల్లీల్లో ఏదో ఒక జట్టు ప్లే ఆఫ్స్ ఛాన్స్‌కి పోటీ పడవచ్చు. గుజరాత్ 8 మ్యాచ్‌లలో 4 విజయాలతో 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ముంబై 8 మ్యాచ్‌లలో 3 గెలుపులతో 6 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఢిల్లీ 8 మ్యాచుల్లో 3 విజయాలతో 6 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ సీజన్ లీగ్ దశలో ఇంకా 32 మ్యాచ్‌లు మిగిలున్నాయి. పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో పంజాబ్ కింగ్స్, పదో స్థానంలో ఆర్సీబీ ఉన్నాయి. ఈ రెండు టీమ్‌లకు దాదాపు ప్లేఆఫ్స్ అవకాశం లేనట్లే.