IPL 2024 MI vs CSK Head to head Records: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(IPL) 29వ మ్యాచ్‌లో కీలక పోరు జరగనుంది. ముంబై ఇండియన్స్‌(MI)తో చెన్నై సూపర్ కింగ్స్(CSK) తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి ఏడున్నరకు జరిగే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముంబై ఇండియన్స్  IPL చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. 2019, 2020, 2013, 2015, 2017ల్లో ముంబై కప్పు గెలుచుకున్నారు. ఇటు చెన్నై కూడా 2010, 2011, 2018, 2021, 2023లో అయిదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఇలా అయిదు అయిదు సార్లు కప్పు గెలిచిన రెండు ఛాంపియన్‌ జట్ల మధ్య పోరు ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టేందుకు సిద్ధంగా ఉంది. 


హెడ్‌ టు హెడ్ రికార్డులు ఇలా...
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై, చెన్నై జట్లు ఇప్పటివరకూ 36 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై 20 మ్యాచుల్లో విజయం సాధించగా...  చెన్నై సూపర్‌కింగ్స్‌  16 విజయాలు సాధించింది. గత అయిదు మ్యాచుల్లో చెన్నై నాలుగుసార్లు విజయం సాధించి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 


అత్యధిక పరుగుల వీరే..
ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో  710 పరుగులతో సురేశ్ రైనా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో  700 పరుగులతో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, 658 పరుగులతో అంబటి రాయుడు  తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో డ్వేన్ బ్రావో 35 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. తర్వాత  31 వికెట్లతో లసిత్‌ మలింగ, 26 వికెట్లతో  హర్భజన్ సింగ్ ఉన్నారు. 


గత మ్యాచ్‌లో ఇలా...
IPL 2023 సీజన్‌లో చెన్నై చెపాక్‌ వేదికగా జరిగిన 49వ మ్యాచ్‌లో చెన్నై- ముంబై తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేసింది. నెహాల్ వధేరా 51 బంతుల్లో 64 చేశాడు. మిగిలిన ముంబై బౌలర్లు ఎవరూ 30 పరుగుల మార్కు కూడా దాటలేదు. పేసర్ మతీషా పతిరనా 3/15తో ముంబై పతనాన్ని శాసించాడు. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే 44 పరుగులు.. శివమ్ దూబే 26 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.


చెన్నై 11‍( అంచనా): రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, శివమ్ దూబే 


ముంబై 11‍( అంచనా):  రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ , తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ, ఆకాష్ మధ్వల్