LSG coach Justin Langer  reacts on buying Rohit Sharma in mega auctions: టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌(MI) స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) గురించి..లక్నో సూపర్‌ జెయింట్స్‌ హెడ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌(LSG coach Justin Langer)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని విడిచిపెడితే.. అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని లాంగర్‌ ప్రకటించాడు. ఈ ప్రకటనతో లాంగర్‌ హిట్‌ మ్యాన్‌ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. IPL 2025 మెగా వేలంలో ఆటగాళ్లందరూ వేలానికి అందుబాటులో ఉంటే... మీ జట్టులోకి ఎవరిని తీసుకుంటారన్న ప్రశ్న  జస్టిన్ లాంగర్‌కు ఎదురైంది. దీనికి లాంగర్‌ స్పందించాడు. రోహిత్ శర్మతో కలిసి పని చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. తాను రోహిత్ శర్మను తమ జట్టులోకి తీసుకొని అతనితో కలిసి పని చేయాలని అనుకుంటున్నట్లు లాంగర్‌ తెలిపాడు. రోహిత్‌ను ముంబై ఇండియన్స్ నుంచి తమ జట్టులోకి తీసుకొస్తామని వెల్లడించాడు. కానీ ముంబై ఇండియన్స్‌ను రోహిత్ శర్మ వదిలేస్తాడని తాను అనుకోవట్లేదని లాంగర్‌ అన్నాడు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ విలువ తనకు బాగా తెలుసని లాంగర్ చెప్పాడు. రోహిత్‌ భారీ సిక్సర్లను అవలోకగా కొట్టగలడని... హిట్‌మ్యాన్‌ ప్రపంచ స్థాయి కెప్టెన్ అని గుర్తు చేశాడు.  


ముంబైను రోహిత్ వీడుతాడా ?
IPL 2024 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్‌శర్మను తప్పించడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రోహిత్- హార్దిక్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. IPL 2024 చివరిలో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టును వీడుతాడన్న ప్రచారం జరుగుతోంది. ముంబైని 5 సార్లు ఐపిఎల్ ఛాంపియన్‌గా చేసిన రోహిత్ శర్మ 2025 ఐపీఎల్‌ మెగా వేలంలో వేలానికి అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.



హార్దిక్‌పై అదే స్థాయిలో ట్రోలింగ్‌
ఐపీఎల్‌(IPL)లో గుజరాత్‌(GT)తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఫీల్డింగ్‌ స్థానాన్ని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(Hardic Pandya) మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప‌దేప‌దే రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ పొజిషన్‌ను హార్దిక్ మారుస్తూ అభిమానుల అగ్ర‌హానికి గురయ్యాడు. సాధ‌ర‌ణంగా 30 యార్డ్ స‌ర్కిల్‌లో ఉండే రోహిత్ ఈ మ్యాచ్‌లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తూ క‌న్పించాడు. గుజ‌రాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవ‌ర్‌లో రోహిత్‌ను తొలుత మిడాన్‌లో ఫీల్డింగ్‌లో చేయ‌మ‌ని చెప్పిన హార్దిక్... తర్వాత హిట్‌మ్యాన్‌ను మ‌ళ్లీ లాంగాన్‌కు వెళ్లమ‌ని సూచించాడు. హార్దిక్‌ ఆదేశాలతో రోహిత్ ప‌రిగెత్తుకుంటూ లాంగాన్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు హార్దిక్ కావాల‌నే రోహిత్ ఫీల్డింగ్‌ను పొజిషన్‌ను మార్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రోహిత్ ఫ్యాన్స్.. ఇటు గుజరాత్ టైటాన్స్ అభిమానులు గట్టిగా అరుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రవర్తించిన తీరు.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రోహిత్‌ ఇక వేరే జట్టుకు వెళ్లిపో అని కొందరు.. హార్దిక్‌కు ముందుంది మొసళ్ల పండగ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.