IPL 2024 RCB vs CSK Head to Head Records : ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024(IPL 2024) చివరి అంకంలోకి ప్రవేశించింది. చెన్నై సూపర్ కింగ్స్(CSK) డిఫెండింగ్ ఛాంపియన్‌గా... ఈసాలా కప్ నమ్దే అంటూ వస్తోన్న బెంగళూరు(RCB)తో తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డూ ఆర్ డై మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. సొంతమైదానంలో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం తలపడనుంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఈ పోరులో ఆర్సీబీ తప్పక విజయం సాధించాలి. తదుపరి దశకు చేరాలంటే సాధారణంగా గెలిస్తే లెక్క సరిపోదు, సీఎస్కే నెట్ రన్ రేటును అధిగమించేలా విజయ ఢంకా మోగించాలి. ఇక మ్యాచ్ గెలిచేది ఎవరంటూ విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో చెన్నై, ఆర్సీబీ లలో ఎవరికి విజయావకాశాలుమెండుగా ఉన్నాయి.
రికార్డుల్లో పైచేయి ఎవరిదంటే..?
ఐపీఎల్‌లో తిరుగులేని టీం చెన్నై సూపర్‌కింగ్స్ ఓవైపు. వరుసగా అయిదు మ్యాచుల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన బెంగళూరు మరోవైపు. ఈ రెండు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది. ఈ కీలకమైన మ్యాచ్‌లో ఈ రెండు జట్ల మధ్య చిన్నపాటి యుద్ధమే కనిపిస్తుంది. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో ఈ రెండు జట్ల 32 మ్యాచ్‌లు జరిగితే చెన్నై 21 మ్యాచ్‌లు గెలిచింది. బెంగళూరు 10 మ్యాచ్‌లు గెలిచింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. రికార్డ్‌లు ఇలా ఉన్నాఈ సారి మాత్రం ఆట మరోలా ఉంటుందని బెంగళూరు ఆత్మ విశ్వాసంతో చెబుతోంది.
గత మ్యాచ్‌లో ఇలా..
ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్‌కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. చెపాక్ మైదానంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ అనుజ్ రావత్ (48: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అత్యధిక పరుగులు సాధించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రచిన్ రవీంద్ర (37: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాలుగు వికెట్లు తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
పిచ్ రిపోర్ట్
బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం పిచ్ ఫ్లాట్‌గా ఉండి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే కొత్త బంతితో పేసర్లు మరింత లాభపడతారు. అయితే, పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు వచ్చే అవకాశం ఉంది. చిన్నస్వామి స్టేడియం చిన్నది కాబట్టి బౌండరీలు, సిక్సర్లు భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయి.
ధోనీపైనే చూపంతా
మహేంద్రసింగ్‌ధోనీ కెప్టెన్సీ వదిలేసినా టీంలోనే కొనసాగుతాడు. ధోనీకి ఈ ఐపీఎల్ చివరిదని భావిస్తున్న వేళ చూపంతా ధోనీపైనే ఉండనుంది. ధోని కెరీర్ ఇక్కడే ముగిసి పోతుందా లేక మరో మ్యాచ్ వరకు కొనసాగుతుందా అన్నది చూడాలి.