Ipl 2024 Dc Vs Mi Match  Delhi Capitals won by 10 runs: ఐపీఎల్‌(IPL)లో ముంబై ఇండియన్స్‌(MI) పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఢిల్లీ(DI)తో జరిగిన హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ వరకూ పోరాడినా ముంబైకు విజయం దక్కలేదు. తిలక్‌ వర్మ చివరి వరకూ క్రీజులో నిలిచిన సాధించాల్సిన రన్‌రేట్‌ భారీగా ఉండడంతో ముంబై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ మెక్‌గర్క్‌, పంత్‌ విధ్వంసంతో నిర్ణీత 20  ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. అనంతరం 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 247 పరుగులకే పరిమితమై... కేవలం 10పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 


ఢిల్లీ బ్యాటర్ల విధ్వంసం 
 ఢిల్లీ ఓపెనర్లు ఫ్రేజర్‌- అభిషేక్‌ పోరెల్‌ తొలి బంతి నుంచే విధ్వంసం ప్రారంభించారు. ముఖ్యంగా ఫ్రేజర్‌...విధ్వంసం సృష్టించాడు. ఫ్రేజర్‌ లూక్‌ వుడ్ వేసిన మొదటి ఓవర్‌లో మూడు ఫోర్లు, సిక్స్‌ బాదేశాడు. తొలి ఓవర్‌లోనే ఢిల్లీకి 19 పరుగులు వచ్చాయి. తర్వాత బుమ్రాను వదలని జేక్‌ ఫ్రేజర్... 18 పరుగులు పిండుకున్నాడు. బుమ్రా వేసిన ఓవర్‌లో సిక్స్‌, రెండు ఫోర్లు బాదేశాడు. ఆ ఓవర్‌లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. నువాన్ తుషారా వేసిన మూడో ఓవర్‌లోనూ 4 ఫోర్లు బాదిన ఫ్రేజర్‌ 18 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఢిల్లీ స్కోరు మూడు ఓవర్లకే 55 పరుగులకు చేరింది. 15 బంతుల్లోనే జేక్‌ ఫ్రేజర్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు. పీయూష్ చావ్లా వేసిన నాలుగో ఓవర్‌లో ఫ్రేజర్‌ సిక్స్, ఫోర్ కొట్టాడు. తర్వాత కెప్టెన్‌ పాండ్య బౌలింగ్‌కు వచ్చినా జేక్ ఫ్రేజర్ వెనక్కి తగ్గలేదు. కెప్టెన్ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో ఫ్రేజర్‌ రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టాడు.


ఆ ఓవర్‌లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. పవర్‌ ప్లే ఆరు ఓవర్లలో ఢిల్లీ ఒక వికెట్‌ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. పవర్‌ ప్లేలో ఎక్కువ రన్స్‌ చేసిన మూడో బ్యాటర్ ఫ్రేజర్ రికార్డు సృష్టించాడు. 78 పరుగులు చేశాడు. ముంబైను బెంబేలెత్తించిన జేక్ ఫ్రేజర్ 84 పరుగుల చేసి ఔటయ్యాడు. దీంతో 114 పరుగుల వద్ద దిల్లీ తొలి వికెట్‌ను నష్టపోయింది. నబీ వేసిన ఓవర్‌లో  36 పరుగులు చేసిన పోరెల్ కూడా అవుటయ్యాడు.  12వ ఓవర్‌లోనే ఢిల్లీ స్కోరు 150 పరుగులు దాటింది.


షై హోప్, పంత్‌ ధాటిగా ఆడారు. దూకుడుగా ఆడుతున్న షై హోప్ 41 పరుగులు చేసి ఔటయ్యాడు. లూక్ వుడ్‌ బౌలింగ్‌ రెండు సిక్స్‌లు కొట్టిన భారీ షాట్‌కు యత్నించిన హోప్‌... డీప్ మిడ్‌ వికెట్‌ వద్ద తిలక వర్మ చేతికి చిక్కాడు. దీంతో 180 పరుగుల వద్ద దిల్లీ మూడో వికెట్‌ను కోల్పోయింది. లూక్ వుడ్ వేసిన నాలుగు బంతులను ఒకేలాంటి షాట్లతో స్టబ్స్‌ బౌండరీలుగా మలిచాడు. రిషభ్‌ పంత్ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. బుమ్రా వేసిన ఓవర్లో పంత్‌ రోహిత్ చేతికి చిక్కాడు. చివర్లో స్టబ్స్‌, అక్షర్‌ పటేల్‌ బ్యాట్ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.


లక్ష్య చేధనలో పోరాడినా..
258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు ఏదీ కలిసి రాలేదు. ఆరంభంలోనే ముంబై కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ముంబై భారీ తేడాతో ఓడిపోయేలా కనిపించింది. కానీ తిలక్‌వర్మ, హార్దిక్‌ పాండ్యా పోరాడారు. పాండ్యా 24 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సులతో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. తిలక్‌ వర్మ చివరి ఓవర్‌ వరకూ పోరాడాడు. ఆరు బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో తిలక్ అవుటయ్యాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో తిలక్‌ 63 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లలో టిమ్ డేవిడ్‌ 17 బంతుల్లో 37 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. దీంతో ముంబై 247 పరుగులకే పరిమితమై... కేవలం 10పరుగుల తేడాతో పరాజయం పాలైంది.