IPL 2024 DC vs KKR Delhi Capitals target 273   వైజాగ్ స్టేడియంలో  పరుగుల వరద పారింది. సిక్స‌ర్ల వ‌ర్షం కురిసింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (kkr)  బ్యాట‌ర్లు   చెల‌రేగారు.  సునీల్ న‌రైన్,   రఘువంశీల అర్ధ శతాకాలతో  కోల్‌కతా  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. దీంతో మరోసారి ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు అయ్యింది.  


విశాఖ వేదికగా ఢిల్లీ, కోల్‌కతా మధ్య జరుగుతున్న మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన  కోల్‌కతా బ్యాటింగ్‌ ఎంచుకుంది.  ఖలీల్ అహ్మద్‌ వేసిన తొలి ఓవర్‌లో ఎక్స్‌ ట్రాల రూపంలో ఏడు పరుగులు వచ్చి చేరాయి. ఇషాంత్ శర్మ వేసిన రెండో ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. మొదటి నాలుగు బంతుల్లో రెండే రన్స్‌ రాగా.. చివరి రెండు బంతులకు ఫిలిప్‌ సాల్ట్   బౌండరీలు బాదాడు. దూకుడుగా ఆడుతున్న ఫిలిప్‌ సాల్ట్  అన్రిచ్‌ నోకియా వేసిన ఐదో ఓవర్లో రెండో బంతికి డేవిడ్ వార్నర్‌ క్యాచ్‌ మిస్‌ చేయడంతో బతికిపోయాడు కానీ  తర్వాతి బంతికే ట్రిస్టన్‌ స్టబ్స్‌కు చిక్కాడు. దీంతో 60 పరుగుల వద్ద కోల్‌కతా మొదటి వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్‌ ఢిల్లీ  బౌలర్లను ఊచకోత కోసాడు. కేవలం  21 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.  దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి కోల్‌కతా 88/1 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. సునీల్ నరైన్ కు రఘువంశీ తోడవ్వటంతో   10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 135. 


దూకుడుగా ఆడుతూ సెంచరీ చేసేలా కనిపించిన సునీల్ నరైన్‌  ఔటయ్యాడు. 39 బంతుల్లో 85  స్కోర్ చేసిన నరైన్‌  7 ఫోర్లు, 7 సిక్స్‌లుబాదాడు . నరైన్‌  ఔటవడంతో  164 పరుగుల వద్ద కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. మరోవైపు 25 బంతులల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రఘువంశీ తరువాత కాసేపటికే   ఔటయ్యాడు. నోకియా వేసిన 13.2 ఓవర్‌కు ఇషాంత్‌ శర్మకు చిక్కాడు. 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శ్రేయస్ అయ్యర్  ఔటయ్యాడు. 8 బాల్స్ కే 26 పరుగులు చేసిన రింకు సింగ్ వార్నర్ కు చిక్కి పెవిలియన్ కు చేరాడు. మొత్తానికి బ్యాటర్ లు చెలరేగటంతో  కోల్‌కతా  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. . 


చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్‌ ఇచ్చిన ఢిల్లీ  ఇప్పుడు మరో విజయం సాధించి సీఎస్‌కేపై తమ గెలుపు గాలివాటం కాదని నిరూపించాలని  పట్టుదలతో ఉన్నారు. గత రికార్డుల ప్రకారం కోల్‌కత్తా-ఢిల్లీ ఇప్పటివరకూ 31 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ 15 మ్యాచుల్లో విజయం సాధించింది. కోల్‌కత్తా 16 మ్యాచుల్లో జయకేతనం ఎగరేసింది.  పృథ్వీ షా, ఆస్ట్రేలియన్ స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌లు ఈ మ్యాచ్‌ రాణించాలని ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. ఏడాదిన్నర తర్వాత ఈ ఐపీఎల్‌లో బరిలోకి దిగిన రిషభ్‌ పంత్... తొలి అర్ధ సెంచరీతో చెలరేగి ఫామ్‌లోకి రావడం ఢిల్లీకి కలిసిరానుంది. దక్షిణాఫ్రికాకు చెందిన ట్రిస్టన్ స్టబ్స్, ఆస్ట్రేలియన్ మిచెల్ మార్ష్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఢిల్లీ జట్టును దేశీయంగా విధ్వంసర బ్యాటర్‌ లేకపోవడం ఆందోళనపరుస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌పై స్టబ్స్ బ్యాట్‌తో  రాణించాడు. ఇంకా మార్ష్‌ తన పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించలేడు. చెన్నైపై ఖలీల్ అహ్మద్ అద్భుతంగా రాణించాడు. ముఖేష్ కుమార్‌, ఇషాంత్ శర్మలు ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.   ప్రస్తుత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఢిల్లీ ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి ఏడో స్థానంలో నిలిచింది.