అవును.... ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటిదాకా 7 మ్యాచెస్ ఆడితే.... అన్నింట్లోనూ ఏడుగురు ప్లేయర్స్ తోనే ఆడింది. అదేంటి... మాకు తెలిసిన క్రికెట్ అంటే 11 మంది ఉండాలి కదా. మరి ఏడుగురే ఏంటీ అనుకుంటున్నారా..? మరి జట్టుకు ఉపయోగపడేలా ఆడుతోంది ఏడుగురే. అందుకే ఇంత హార్ష్ గా మాట్లాడుకోవాల్సి వస్తోంది. నిన్న రాజస్థాన్ తో మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది కాబట్టి సరిపోయింది.... లేకపోతే ఓటమికి ఆ నలుగురే కారణం అని చెప్పుకోవాలి.
ఆర్సీబీ బ్యాటింగ్ అంటే ప్రధానంగా... KGF. అంటే కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్ వెల్, ఫాఫ్ డు ప్లెసిస్. వీరే మొత్తం బ్యాటింగ్ భారాన్ని మోస్తారు. కానీ ప్రతి మ్యాచూ ఆడలేరు కదా. అలాంటప్పుడైనా మిగతా వాళ్లు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. లేదు. అలా జరిగిందే లేదు. నిన్న కోహ్లీ గోల్డెన్ డక్. ఆ తర్వాత మ్యాక్స్ వెల్, ఫాఫ్ అంతా చక్కదిద్దారు. కానీ వేరే లెవెల్ కు వెళ్లాల్సిన స్కోర్ 189 దగ్గరే ఆగిపోయిది.
మహిపాల్ లోమ్రోర్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తిక్, సుయాష్ ప్రభుదేశాయ్.... ఈ నలుగురు ఆర్సీబీ మిడిల్ ఆర్డర్.... ఈ సీజన్ నిరాశపరుస్తూనే వచ్చారు. అనుజ్ రావత్ ఆడిన ఒకట్రెండు మ్యాచులూ అంతే. వీరంతా జట్టుకు పనికొచ్చే ఒక్క ఇన్నింగ్సూ ఆడలేదు. దినేశ్ కార్తిక్ అయితే మరీ ఘోరం. ఓ అనుభమైన ప్లేయర్, లాస్ట్ సీజన్ చాలా బాగా ఆడిన ఆటగాడు... ఈ సీజన్ అస్సలు బాధ్యత తీసుకోవట్లేదు. వికెట్ పారేసుకుంటున్నాడు.
వీళ్ల ఆట ఇలా ఉంది కాబట్టే.... బ్యాటింగ్ లో కోహ్లీ, మ్యాక్సీ, ఫాఫ్... బౌలింగ్ లో సిరాజ్, హసరంగ, విల్లీ, హర్షల్ పటేల్.... ఇలా మొత్తం ఏడుగురే ఆర్సీబీకి ఆడుతున్నారు అని చెప్పినది. రూల్స్ ప్రకారం 11 మంది ఉండాలి కాబట్టి ఈ నలుగురు పేర్లు లిస్ట్ లో యాడ్ చేసి ఇచ్చేస్తున్నట్టు ఉన్నారు. ఇప్పుడంటే ఏదోలా గెలిచేస్తున్నారు కానీ.... టోర్నమెంట్ ఇంకా ముందుకెళ్లేసరికి కీలకమైన మ్యాచెస్ లో లేదా క్వాలిఫయర్స్ లో ఈ మైనస్సే చాలా ఘోరంగా దెబ్బతీస్తుంది. కోలుకోకపోతే ఆర్సీబీపై మళ్లీ చోకర్స్ ముద్ర తప్పదు.
ఐపీఎల్‌లో ఆదివారం మధ్యాహ్నం రాజస్తాన్ రాయల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో దేవ్‌దత్ పడిక్కల్ (52: 34 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తనకు యశస్వి జైస్వాల్ (47: 37 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు. ఆఖర్లో ధ్రువ్ జురెల్ (34 నాటౌట్: 16 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) పోరాడాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇక బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (77: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫాఫ్ డుఫ్లెసిస్ (62: 39 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ తప్ప ఇంకెవరూ రాణించలేకపోయారు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో చెత్త ప్రదర్శన కనబరిచారు. కేవలం 33 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయారు.