IPL 2023, SRH vs RCB:
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మోత మోగించింది! పరుగుల వరద పారించింది. నెమ్మది పిచ్‌పై దంచికొట్టింది. కీలక మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ టార్గెట్ ఇచ్చింది. 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ సీజన్లోనే బెస్ట్ ఫామ్‌లో ఉన్న హెన్రిచ్ క్లాసెన్ (104; 51 బంతుల్లో 8x4, 6x6) మాస్ హిట్టింగ్‌తో చెలరేగాడు. ఐపీఎల్‌లో అద్వితీయమైన సెంచరీ అందుకున్నాడు. హ్యారీ బ్రూక్ (27*; 19 బంతుల్లో 2x4, 1x6) ఫర్వాలేదు! మహ్మద్ సిరాజ్ అత్యంత ఎకనామికల్ (1/17)గా బౌలింగ్ చేశాడు.
ఆరంభం.. ఆవిరి!
ఎప్పట్లాగే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మంచి ఆరంభం దక్కలేదు. పవర్‌ప్లేలోనే రెండు వికెట్లు పడ్డాయి. జట్టు స్కోరు 27 వద్ద అభిషేక్ శర్మ (11), 28 వద్ద రాహుల్ త్రిపాఠి (15)ని బ్రాస్‌వెల్ ఔట్ చేశాడు. దాంతో 6 ఓవర్లకు ఆరెంజ్ ఆర్మీ 49/2తో నిలిచింది. వికెట్ నెమ్మదిగా ఉండటం.. బెంగళూరు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అయిడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ మొదట నెమ్మదిగా ఆడారు. ఒకట్రెండు షాట్లతో మూమెంటమ్ అందుకోగానే క్లాసెన్ విజృంభించాడు. ఆర్సీబీ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మూడో వికెట్‌కు 50 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యం అందించాడు.
క్లాసెన్.. మాస్ హిట్టింగ్!
నిలదొక్కుకున్న ఈ జోడీని మార్‌క్రమ్‌ను ఔట్ చేయడం ద్వారా షాబాజ్ అహ్మద్ విడదీశాడు. అప్పటికి స్కోరు 104/3. అయితే హ్యారీ బ్రూక్ అండతో క్లాసెన్ మరింత రెచ్చిపోయాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ భారీ షాట్లు కొట్టారు. ఐదో వికెట్‌కు కేవలం 36 బంతుల్లోనే 74 పరుగుల విలువైన పాట్నర్‌షిప్ నెలకొల్పారు. దాంతో 16.2 ఓవర్లకు సన్‌రైజర్స్ 150కి చేరుకుంది. ఆ తర్వాత క్లాసెన్ మరింత విజృంభించాడు. సిక్సర్లు, బౌండరీలతో డీల్ చేస్తూ.. 49 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. 19వ ఓవర్ ఐదో బంతికి అతడిని హర్షల్ పటేల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆఖరి ఓవర్‌ను మహ్మద్ సిరాజ్ అద్భుతంగా వేయడంతో సన్‌రైజర్స్ 186/5కు పరిమితమైంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రర్, అనుజ్ రావత్, షాబాజ్ అహ్మద్, మైకేల్ బ్రాస్‌వెల్, వేన్ పర్నెల్, హర్షల్ పటేల్, కరన్ శర్మ, మహ్మద్ సిరాజ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, కార్తీక్ త్యాగీ, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, నితీశ్ రాణా