World Cup 2023, IPL 2023: 


ఐపీఎల్‌ 2023లో దేశవాళీ క్రికెటర్లు అదరగొడుతున్నారని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. భవిష్యత్తులో వారు భారత జట్టుకు కీలకం అవుతారని పేర్కొన్నాడు. సీనియర్లు గాయపడితే యశస్వీ జైశ్వాల్‌, రింకూ సింగ్‌, తిలక్‌ వర్మకు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అవకాశం దొరకొచ్చని అంచనా వేశాడు.


ఈ సీజన్లో దేశవాళీ క్రికెటర్లు అమేజింగ్‌ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నారు. వికెట్లూ తీస్తున్నారు. రాజస్థాన్‌ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ 13 మ్యాచుల్లో 575 పరుగులు చేశాడు. టోర్నీలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. సెంచరీ సైతం కొట్టాడు. తెలుగబ్బాయి తిలక్‌ వర్మ ముంబయి ఇండియన్స్‌కు కీలకంగా మారాడు. మిడిలార్డర్లో దూకుడుగా ఆడుతూ విజయాలు అందించాడు.


ఇక రింకూ సింగ్‌ అయితే ఇరగదీశాడు. ప్రతి మ్యాచులోనూ కేకేఆర్‌ను ఆదుకున్నాడు. తిరుగులేని మ్యాచ్‌ ఫినిషర్‌గా అవతరించాడు. పంజాబ్‌ కింగ్స్‌లో జితేశ్‌ శర్మ, గుజరాత్‌లో సాయి సుదర్శన్ సైతం ఇంప్రెస్‌ చేశాడు. వీరందరిపై రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.


Also Read: ఢిల్లీకి చెలగాటం - చెన్నైకి ప్రాణ సంకటం - సూపర్ కింగ్స్ జాగ్రత్తగా ఆడాల్సిందే!


'యశస్వీ జైశ్వాల్‌ ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతున్నాడు. గతేడాదితో పోలిస్తే ఇప్పుడెంతో మెరుగయ్యాడు. అది పాజిటివ్‌ సూచన. ఒక యువ క్రికెటర్‌ తన ఆటను మెరుగు పర్చుకొనేందుకు ఎంత కష్టపడ్డాడో అతడిని చూస్తే అర్థమవుతుంది. ఈ సీజన్లో ప్రతి మ్యాచులోనూ ఆల్‌రౌండ్‌ నైపుణ్యాలు ప్రదర్శించాడు. మంచి పవర్‌తో షాట్లు కొడుతున్నాడు. గతేడాదితో పోలిస్తే అతడి షాట్లు తిరుగులేని విధంగా ఉన్నాయి' అని రవిశాస్త్రి అన్నాడు.


'నన్ను ఆకట్టుకున్న మరో ఆటగాడు రింకూ సింగ్‌. అతడిదో గొప్ప కథ! అతనాడుతుంటే ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తుంది. అతడి టెంపర్‌మెంట్‌ చాలా బాగుంది. మానసికంగా ఎంతో దృఢమైనవాడు. జైశ్వాల్‌తో పాటు ఇతడూ పేదరికం నుంచే వచ్చాడు. ఎంతో కష్టపడ్డారు. ఈ స్థాయికి అంత సులభంగా ఎదగలేదు. వారి కళ్లలో కసి, ఆకలి, ప్యాషన్‌ కనిపిస్తున్నాయి. ఇలాగే ఉంటే వాళ్లనెవ్వరూ ఆపలేరు' అని శాస్త్రి పేర్కొన్నాడు.


యశస్వీ జైశ్వాల్‌, రింకూ సింగ్‌, తిలక్‌ వర్మ ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ రేసులో కచ్చితంగా ఉంటారని రవిశాస్త్రి తెలిపాడు. సీనియర్‌ క్రికెటర్లు గాయపడితే వీరికి కచ్చితంగా అవకాశాలు వస్తాయని అంచనా వేశాడు. 'బ్యాటింగ్‌ డిపార్ట్‌మెంట్లో తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ డేంజరస్‌గా ఉన్నారు. అయితే తిలక్‌, జైశ్వాల్‌, రింకూకు నేను ఓటేస్తాను. రుతురాజ్‌ ఫర్వాలేదు. సెప్టెంబర్‌ వరకు ఫామ్‌ను బట్టి వీరంతా సెలక్షన్‌ పరిధిలోకి వస్తారు. సీనియర్లు గాయపడితే వీరికి అవకాశం దొరకొచ్చు' అని ఆయన పేర్కొన్నాడు.