Rohit Sharma, IPL 2023: 


ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిమానులను మురిపించాడు. హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే తెలుగులో మాట్లాడాడు. 'మేము వచ్చిసినమ్‌. ఎంఐ ఫ్యాన్స్‌.. పదండి ఉప్పల్‌కు' అని హిట్‌ మ్యాన్‌ మాట్లాడటం ఆకట్టుకుంది. ఈ వీడియోను ముంబయి ఇండియన్స్ సోషల్‌ మీడియా టీమ్ ట్విటర్లో పెట్టింది. వెంటనే వందల కొద్దీ కామెంట్లు, షేర్లు వచ్చేశాయి.






ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో భాగంగా ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నేడు తలపడుతున్నాయి. రెండు జట్లూ తలో రెండు మ్యాచులు గెలిచాయి. రెండు ఓడిపోయాయి. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఆరు పాయింట్లో పట్టికలో ముందుకు వెళ్తుంది.


తెలుగు నేలతో రోహిత్‌ శర్మకు మంచి అనుబంధం ఉంది. హైదరాబాద్‌, విశాఖపట్నంలో అతడికి బంధువులు ఉన్నారు. అతడి అమ్మమ్మ వాళ్లది ఒకప్పుడు వైజాగ్‌ నగరమే అని చెప్పాడు. పైగా తెలుగు నేలపై ఆడటం సెంటిమెంటుగా భావిస్తాడు.






హైదరాబాద్‌లో దిగగానే రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ సందడి చేశారు. 'రోహిత్‌.. రోహిత్‌.. రోహిత్‌' అంటూ అరుపులు కేకలు పెట్టారు. తొలిసారి హైదరాబాద్‌లో మ్యాచ్‌ ఆడుతుండటంతో తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ ఆనందంగా ఉన్నాడు. నగరానికి రాగానే ముంబయి ఆటగాళ్లను వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు.


కమాన్‌.. ఆరెంజ్‌ ఆర్మీ!


ఈ సీజన్లో తొలి రెండు మ్యాచుల్లో ఇబ్బంది పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) తర్వాత ఫామ్‌లోకి వచ్చింది. రెండు విజయాలు సాధించింది. విన్నింగ్‌ కాంబినేషన్‌ సెట్టైనట్టే కనిపిస్తోంది. డిస్ట్రక్టివ్‌ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను (Harry Brook) ఓపెనింగ్‌కు పంపించడం వరంగా మారింది. అతడు సెంచరీ కొట్టి ప్రకంపనలు సృష్టించాడు. మయాంక్‌ అతడికి అండగా ఉంటాడు. రాహుల్‌ త్రిపాఠి, అయిడెన్‌ మార్‌క్రమ్‌, అభిషేక్ శర్మతో మిడిలార్డర్‌ పటిష్ఠంగా మారింది. ఈ త్రయంలో ఒక్కరు నిలిచినా రన్స్‌ ఫెస్ట్‌ తప్పదు! హెన్రిచ్‌ క్లాసెన్‌ను మర్చిపోవద్దు. వాషింగ్టన్‌ సుందర్‌ను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలి. మార్కో జన్‌సెన్‌, భువీ లోయర్‌ ఆర్డర్లో కీలకం అవుతారు. బౌలింగ్‌ పరంగా ఆరెంజ్‌ ఆర్మీకి ఫర్వాలేదు. భువీ, ఉమ్రాన్‌, మార్కో, నట్టూ పేస్‌తో విజృంభిస్తున్నారు. మర్కండే, అభిషేక్‌, మార్‌క్రమ్‌, సుందర్‌ స్పిన్‌ చూసుకుంటారు.