RR vs LSG, IPL 2023:


ఐపీఎల్‌ 2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ నాలుగో విజయం అందుకుంది. స్కోర్లను డిఫెండ్‌ చేసుకోవడంలో తమకు తిరుగులేదని చాటింది. డిస్ట్రక్టివ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌పై 155 పరుగుల టార్గెట్‌ను కాపాడుకుంది. ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టును 144/6 వద్దే నిలువరించింది. యశస్వీ జైశ్వాల్‌ (44; 35 బంతుల్లో 4x4, 2x6), జోస్‌ బట్లర్‌ (40; 41 బంతుల్లో 4x4, 1x6) రాణించారు. దేవదత్‌ పడిక్కల్‌ (26; 21 బంతుల్లో 4x4) ఆఖర్లో పోరాడాడు. అంతకు ముందు లక్నోలో ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (51; 42 బంతుల్లో 4x4, 3x6) హాఫ్‌ సెంచరీ కొట్టాడు. కేఎల్‌ రాహుల్‌ (39; 32 బంతుల్లో 4x4, 1x6) సెకండ్ ఫిడెల్‌ ప్లే చేశాడు. ఆఖర్లో నికోలస్‌ పూరన్‌ (29; 20 బంతుల్లో 2x4, 1x6) మెరుపు షాట్లు బాదేశాడు.


10 ఓవర్ల వరకు వికెట్టే లేదు!


ట్రికీ వికెట్‌పై 155 పరుగుల లక్ష్య ఛేదనను రాజస్థాన్‌ అద్భుతంగా ఆరంభించింది. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్‌, జోస్ బట్లర్‌ తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం అందించారు. బౌలింగ్‌ బాగుండటం.. వికెట్‌ కష్టంగా ఉండటంతో బట్లర్‌ తడబడ్డాడు. తన సహజమైన దూకుడు కనబరచలేదు. జైశ్వాల్‌ మాత్రం బాల్‌ను చక్కగా మిడిల్‌ చేశాడు. వీరిద్దరూ దాదాపుగా మ్యాచును తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. అయితే 11.3వ బంతికి జైశ్వాల్‌ను స్టాయినిస్‌ ఔట్‌ చేసి బ్రేకిచ్చాడు. 12.4వ బంతికి సంజూ శాంసన్‌ (2) రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే బట్లర్‌నూ స్టాయినిసే పెవిలియన్‌ పంపి లక్నో వైపు మూమెంటమ్‌ను మార్చాడు.


లక్కు మార్చిన స్టాయినిస్‌


ఈ సిచ్యువేషన్లో దేవదత్‌ పడిక్కల్‌ చక్కని ఇన్నింగ్స్‌ ఆడాడు. కఠినమైన బంతుల్ని గౌరవిస్తూనే చెత్త బంతుల్ని వేటాడాడు. 15.1వ బంతికి హెట్‌మైయర్‌ (2) ఔటవ్వడంతో రాజస్థాన్‌పై ఒత్తిడి పెరిగింది. అతడిచ్చిన క్యాచ్‌ను కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా ఒడిసిపట్టాడు. లక్నో మరింత కట్టుదిట్టంగా బంతులేయడంతో రాజస్థాన్‌ చేయాల్సిన రన్‌రేట్‌ పెరిగింది. ఈ సిచ్యువేషన్లో రియాన్‌ పరాగ్‌ (15)తో కలిసి పడిక్కల్‌ 26 బంతుల్లో 37 రన్స్ భాగస్వామ్యం అందించాడు. అయితే విజయ సమీకరణంగా 18 బంతుల్లో 42గా మారినప్పుడు స్టాయినిస్ వేసిన 18వ ఓవర్లో పడిక్కల్‌ మూడు బౌండరీలు బాది ఆశలు కల్పించాడు. తర్వాతి ఓవర్లో పరాగ్‌ సిక్సర్‌ బాదడంతో రాయల్స్‌ ఆఖరి 6 బంతుల్లో 19 చేయాల్సి వచ్చింది. తొలి బంతినే పరాగ్‌ బౌండరీకి పంపించి అవేశ్‌పై ఒత్తిడి తెచ్చాడు. 3, 4 బంతుల్లో పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్‌ను ఔట్‌ చేసిన అవేశ్‌... లక్నోను గెలిపించాడు.


లక్నో ఓపెనింగ్‌ బెస్ట్‌


రెండు వైపులా పదునైన పిచ్‌.. మధ్య మధ్యలో నెర్రలు.. బౌలర్లకు అనుకూలిస్తున్న వికెట్‌.. దాంతో లక్నో సూపర్‌ జెయింట్స్ మొదట నిలకడగా ఆడింది. ట్రెంట్‌ బౌల్ట్‌, సందీప్ శర్మ బౌలింగ్‌ ఆడేందుకు ఇబ్బంది పడింది. పవర్‌ ప్లే ముగిసే సరికి కేఎల్‌ రాహుల్‌, కైల్‌ మేయర్స్‌ 37 పరుగులే చేశారు. అయితే 7-9 ఓవర్ల మధ్య ఓపెనర్లు ఇద్దరూ చెలరేగారు. యుజ్వేంద్ర చాహల్‌ను టార్గెట్‌ చేసి సిక్సర్లు, బౌండరీ బాదారు. 9 ఓవర్లకు 74 స్కోరుతో స్ట్రాటజిక్‌ టైమౌట్‌ తీసుకున్నారు. తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని 10.4వ బంతికి రాహుల్‌ను ఔట్‌ చేయడం ద్వారా హోల్డర్‌ విడదీశాడు. మరో 3 పరుగులకే ఆయుష్ బదోనీ (1)ని ట్రెంట్‌ బౌల్ట్‌ ఔట్‌ చేశాడు. 99 వద్ద భారీ షాట్‌ ఆడబోయి దీపక్ హుడా (2) పెవిలియన్‌ చేరాడు.


స్టాయినిస్‌, పూరన్‌ దంచుడు


ఒకవైపు వికెట్లు పడుతున్నా కైల్‌ మేయర్స్‌ నిలిచాడు. 40 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. దాంతో 13.3 ఓవర్లకు లక్నో 100 పరుగుల మైలురాయికి చేరుకుంది. 14-17 ఓవర్ల మధ్య లక్నోను రాజస్థాన్‌ బౌలర్లు నిలువరించారు. జట్టు స్కోరు 104 వద్ద మైయర్స్‌ను అశ్విన్‌ బౌల్డ్‌ చేశాడు. క్యారమ్‌ బాల్‌ను మేయర్స్‌ అంచనా వేయలేకపోయాడు. ఈ సిచ్యువేషన్లో మార్కస్‌ స్టాయినిస్‌, నికోలస్‌ పూరన్‌ కలిసి ఐదో వికెట్‌కు 34 బంతుల్లో 45 రన్స్‌ పాట్నర్‌షిప్‌ అందించారు. జట్టు స్కోరును 150 దాటించారు. హోల్డర్‌ వేసిన 19వ ఓవర్లో పూరన్‌ రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌ బాది 17 రన్స్‌ రాబట్టాడు. ఆఖరి ఓవర్లో స్టాయినిస్‌, పూరన్‌, యుధ్‌వీర్‌ ఔటవ్వడంతో లక్నో 154/7 వద్ద ఆగిపోయింది.