RR vs LSG, IPL 2023: 


సవాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియంలో లక్నో సూపర్‌ జెయింట్స్ డిఫెండబుల్‌ స్కోరే చేసింది. ఆతిథ్య రాజస్థాన్‌ రాయల్స్‌కు 155 రన్స్ టార్గెట్‌ ఇచ్చింది. టూ పేస్‌ పిచ్‌పై షాట్లు ఆడేందుకు లక్నో బ్యాటర్లు కష్టపడ్డారు. ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ (51; 42 బంతుల్లో 4x4, 3x6) ఈ సీజన్లో మూడో హాఫ్ సెంచరీ కొట్టాడు. కేఎల్‌ రాహుల్‌ (39; 32 బంతుల్లో 4x4, 1x6) సెకండ్ ఫిడెల్‌ ప్లే చేశాడు. ఆఖర్లో నికోలస్‌ పూరన్‌ (29; 20 బంతుల్లో 2x4, 1x6) మెరుపు షాట్లు బాదేశాడు. రాయల్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ 2 వికెట్లు తీశాడు.






మేయర్స్‌, రాహుల్‌ ఓపెనింగ్‌


రెండు వైపులా పదునైన పిచ్‌.. మధ్య మధ్యలో నెర్రలు.. బౌలర్లకు అనుకూలిస్తున్న వికెట్‌.. దాంతో లక్నో సూపర్‌ జెయింట్స్ మొదట నిలకడగా ఆడింది. ట్రెంట్‌ బౌల్ట్‌, సందీప్ శర్మ బౌలింగ్‌ ఆడేందుకు ఇబ్బంది పడింది. పవర్‌ ప్లే ముగిసే సరికి కేఎల్‌ రాహుల్‌, కైల్‌ మేయర్స్‌ 37 పరుగులే చేశారు. అయితే 7-9 ఓవర్ల మధ్య ఓపెనర్లు ఇద్దరూ చెలరేగారు. యుజ్వేంద్ర చాహల్‌ను టార్గెట్‌ చేసి సిక్సర్లు, బౌండరీ బాదారు. 9 ఓవర్లకు 74 స్కోరుతో స్ట్రాటజిక్‌ టైమౌట్‌ తీసుకున్నారు. తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని 10.4వ బంతికి రాహుల్‌ను ఔట్‌ చేయడం ద్వారా హోల్డర్‌ విడదీశాడు. మరో 3 పరుగులకే ఆయుష్ బదోనీ (1)ని ట్రెంట్‌ బౌల్ట్‌ ఔట్‌ చేశాడు. 99 వద్ద భారీ షాట్‌ ఆడబోయి దీపక్ హుడా (2) పెవిలియన్‌ చేరాడు.






స్టాయినిస్‌, పూరన్‌ దంచుడు


ఒకవైపు వికెట్లు పడుతున్నా కైల్‌ మేయర్స్‌ నిలిచాడు. 40 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. దాంతో 13.3 ఓవర్లకు లక్నో 100 పరుగుల మైలురాయికి చేరుకుంది. 14-17 ఓవర్ల మధ్య లక్నోను రాజస్థాన్‌ బౌలర్లు నిలువరించారు. జట్టు స్కోరు 104 వద్ద మైయర్స్‌ను అశ్విన్‌ బౌల్డ్‌ చేశాడు. క్యారమ్‌ బాల్‌ను మేయర్స్‌ అంచనా వేయలేకపోయాడు. ఈ సిచ్యువేషన్లో మార్కస్‌ స్టాయినిస్‌, నికోలస్‌ పూరన్‌ కలిసి ఐదో వికెట్‌కు 34 బంతుల్లో 45 రన్స్‌ పాట్నర్‌షిప్‌ అందించారు. జట్టు స్కోరును 150 దాటించారు. హోల్డర్‌ వేసిన 19వ ఓవర్లో పూరన్‌ రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌ బాది 17 రన్స్‌ రాబట్టాడు. ఆఖరి ఓవర్లో స్టాయినిస్‌, పూరన్‌, యుధ్‌వీర్‌ ఔటవ్వడంతో లక్నో 154/7 వద్ద ఆగిపోయింది.


రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌,  రియాన్‌ పరాగ్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, ధ్రువ్‌ జోరెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జేసన్‌ హోల్డర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, యుజ్వేంద్ర చాహల్‌, సందీప్ శర్మ


లక్నో సూపర్‌ జెయింట్స్‌: కేఎల్‌ రాహుల్‌, కైల్‌ మేయర్స్‌, దీపక్ హుడా, కృనాల్‌ పాండ్య, నికోలస్‌ పూరన్‌, మార్కస్‌ స్టాయినిస్‌, ఆయుష్ బదోనీ, నవీన్‌ ఉల్‌ హఖ్‌,  రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌, యుధ్‌వీర్‌ చరక్