SRH vs RR, IPL 2023: 


రాజస్థాన్‌ రాయల్స్‌ ఏం మారలేదు! చివరి సీజన్‌లో  ఎక్కడ వదిలేసిందో అక్కడ్నుంచే మొదలెట్టింది. అదే దూకుడు.. అదే బాదుడు! ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో రెచ్చిపోయింది. ఉప్పల్‌ స్టేడియంలో మోత మోగించింది. ప్రత్యర్థికి 204 పరుగుల భారీ టార్గెట్‌ నిర్దేశించింది. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (54; 22 బంతుల్లో 7x4, 3x6), యశస్వీ జైశ్వాల్‌ (54; 37 బంతుల్లో 9x4), కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (55; 32 బంతుల్లో 3x4, 4x6) వరుసగా హాఫ్ సెంచరీలు బాదేశారు. హైదరాబాద్‌లో ఫజల్‌ హక్‌ ఫారూఖీ, టి నటరాజన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.




బట్లర్‌ బాదుడు


ఐపీఎల్‌ 2023కి ఒక్కసారిగా జోష్ తీసుకొచ్చింది రాజస్థాన్‌ రాయల్స్‌! ఉప్పల్‌ స్టేడియంలో సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించింది. అభిమానులను ఆనందంతో ముంచెత్తింది. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌, యశస్వీ జైశ్వాల్‌ కలిసి 6 ఓవర్లు ముగిసే సరికే వికెట్‌ నస్టానికి 85 పరుగులు చేశారు. ఐపీఎల్‌ చరిత్రలోనే పవర్‌ ప్లేలో అత్యధిక స్కోర్‌తో రికార్డు సృష్టించారు. ముఖ్యంగా  ఇంగ్లాండ్‌ విధ్వంసక ఆటగాడు, జోస్‌ బట్లర్‌ 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. దాంతో రాయల్స్‌ 3.4 ఓవర్లకే 50 స్కోరు చేసింది. అయితే ఫారూఖీ వేసిన 5.5వ బంతికి బట్లర్‌ మిడిల్‌ వికెట్‌ ఎగిరిపోయింది. అప్పటికి ఊచకోత కాస్త తగ్గింది.




సంజూ, జైశ్వాల్‌ క్లాస్‌


బట్లర్‌ ఔటైనా సన్‌రైజర్స్‌కు కష్టాలు తప్పలేదు. సంజూ శాంసన్‌, యశస్వీ కలిసి సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 40 బంతుల్లో 54 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి జోష్‌తో రాజస్థాన్‌ 7.4 ఓవర్లకే 100 పరుగులు మైలురాయిని అధిగమించింది. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన జైశ్వాల్‌ను 12.3వ బంతికి ఫారూఖీనే ఔట్‌ చేశాడు. కానీ శాంసన్‌ ఎలిగెంట్‌ సిక్సర్లు, బౌండరీలతో 28 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. దాంతో 13.5 ఓవర్లకు రాయల్స్‌ స్కోరు 150 దాటేసింది. ఈ సిచ్యువేషన్లో సన్‌రైజర్స్‌ బౌలర్లు క్లిక్‌ అయ్యారు. ఆదిల్‌ రషీద్‌, నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ కలిసి రాయల్స్‌ను కట్టడి చేశారు. 151 వద్ద పడిక్కల్‌ (2)ను ఉమ్రాన్ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 170 వద్ద రియాన్‌ పరాగ్‌ (7), 187 వద్ద సంజూను నట్టూ ఔట్‌ చేశాడు. అయితే ఆఖర్లో షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (22*; 16 బంతుల్లో 1x4, 1x6) నిలబడి స్కోరును 203/5కి చేర్చాడు.




రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్


సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, ఫజల్హాక్ ఫరూఖీ