IPL 2023 Auction: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ బజ్‌ మళ్లీ మొదలైంది! ఐపీఎల్‌ 2023 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహిస్తారని సమాచారం. బహుశా 16న వేలం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఫ్రాంచైజీలతో బీసీసీఐ అనధికారికంగా మాట్లాడినట్టు తెలిసింది.


ఫ్రాంచైజీలు కనీసం రూ.5 కోట్ల రిజర్వు మనీతో వేలంలో దిగాల్సి ఉంటుంది. రూ.95 కోట్ల వరకు పర్స్‌ ఉంచుకోవచ్చు. గతేడాది కన్నా ఇది రూ.5 కోట్లు ఎక్కువే కావడం గమనార్హం. ఆటగాళ్లను విడుదల చేయడం, బదిలీ చేసుకోవడం ద్వారా పర్స్‌ పెంచుకోవచ్చు.


టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఈసారి వేలంలో ప్రధాన ఆకర్షణ మారే అవకాశం ఉంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడిని వదిలించుకోవాలని చూస్తోంది. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌తో జడ్డూను బదిలీ చేసుకొనేందుకు గుజరాత్‌ టైటాన్స్‌తో సీఎస్‌కే చర్చించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ అంగీకరించలేదు. జడ్డూ గురించి దిల్లీ క్యాపిటల్స్‌ సహా మరికొన్ని ఫ్రాంచైజీలు చెన్నై సంప్రదించినట్టు తెలుస్తోంది.


గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాళ్ల గురించి సీఎస్‌కే ఎక్కువగా సంప్రదించినట్టు సమాచారం. రాహుల్‌ తెవాతియా, ఆర్‌.సాయి కిషోర్‌ను బదిలీ చేయాల్సిందిగా కోరినా జీటీ ఆ ఆఫర్లను తిరస్కరించిందట. ఐపీఎల్‌ వేలానికి వారం రోజుల వరకు ట్రేడ్‌ విండో తెరిచే ఉంటుంది. వేలం పూర్తయ్యాక మళ్లీ ఓపెన్‌ అవుతుంది. ఇప్పటికైతే ఐపీఎల్‌ 2023 సీజన్‌ ఆరంభ తేదీ ప్రకటించలేదు. బహుశా మార్చి నాలుగో వారంలో మొదలవ్వొచ్చు.


హోమ్ అండ్ అవే ఫార్మాట్


IPL 2023: వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌ మళ్లీ పాత ఫార్మాట్లోనే జరగనుంది. హోమ్‌ అండ్‌ అవే పద్ధతిలోనే మ్యాచులు జరుగుతాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. పది ఫ్రాంచైజీలు తమ హోమ్‌ గ్రౌండ్‌లో సగం మ్యాచులు ఆడతాయని ప్రకటించారు. మిగతా మ్యాచులు ప్రత్యర్థి మైదానాల్లో ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర సంఘాలకు లేఖ రాశారు.


కరోనా మహమ్మారి రాకతో మూడేళ్లుగా ఐపీఎల్‌కు అనేక ఆంటకాలు ఎదురయ్యాయి. 2020 సీజన్లో లీగును కొన్ని నెలల పాటు నిరవధికంగా వాయిదా వేశారు. ఆ తర్వాత యూఏఈలో అత్యంత కఠినమైన క్వారంటైన్‌ నిబంధనల మధ్య నిర్వహించారు. 2021 సీజన్‌ను భారత్‌లోనే మొదలు పెట్టారు. ముంబయి, దిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌లో సగం సీజన్‌ను విజయవంతంగా నిర్వహించారు. డెల్టా వేరియంట్‌ విపరీతంగా వ్యాపించడం, ఆక్సిజన్‌ లేక కొందరు ప్రాణాలు విడవడం, ఆటగాళ్లకు కరోనా రావడంతో రెండో దశను మళ్లీ యూఏఈలోనే పూర్తి చేశారు. 2022 సీజన్‌ను అత్యంత కట్టుదిట్టంగా భారత్‌లోనే నిర్వహించారు. ముంబయిలోని మూడు, పుణె మైదానంలో మ్యాచులు జరిగాయి. ప్లేఆఫ్, ఫైనల్‌ మ్యాచులకు మొతేరా ఆతిథ్యమిచ్చింది.


ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడింది. భారత్‌లో వ్యాక్సినేషన్ పూర్తైంది. దాంతో వచ్చే సీజన్‌ను మళ్లీ పాత పద్ధతిలోనే కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 'వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ మళ్లీ పాత విధానంలోకి మారిపోతుంది. హోమ్‌ అండ్‌ అవే ఫార్మాట్లో మ్యాచులు జరుగుతాయి. పది జట్లు తమకు కేటాయించిన సొంత మైదానాల్లో మ్యాచులు ఆడతాయి' అని రాష్ట్ర సంఘాలకు గంగూలీ లేఖ రాశారని పీటీఐ తెలిపింది.